ఇండియాదే గెలుపు

India win– తెలంగాణకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు
– రాష్ట్రంలో 12 సీట్లు గెలుస్తాం
– పవర్‌ హాలిడే అన్నోడికి కరెంట్‌ షాకివ్వాలి
– కేసీఆర్‌ ఉద్యమకారుడు కాదు…వ్యాపారస్తుడు
– విత్తనాలు వేరే బ్రాండ్‌ అడుగుతున్నారు
– ‘ఉమ్మడి’ గడువు ముగిసింది.. ఇక చర్చే లేదు
– సెక్రటేరియట్‌లో ‘తెలంగాణ తల్లి విగ్రహం’
– జూన్‌ 27 తర్వాతే కొత్త పీసీసీ ప్రక్రియ
– ‘దశాబ్ది’ నిర్వహణ జీవితంలో మర్చిపోలేను : ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నప్పటికీ కేంద్రంలో ‘ఇండియా బ్లాక్‌’ ప్రభుత్వమే ఏర్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కేంద్రమంత్రి పదవులను అడుగుతామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 9 నుంచి 13 ఎంపీ సీట్లు గెలుస్తామని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ హవా కొనసాగనుందని తెలిపారు. అనుకున్న ఫలితాలు రాకపోతే ఇక నుంచి మరో రెండు గంటలు (20 గంటలు) ఎక్కువ పని చేస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులకు సోనియాగాంధీ వస్తారనీ ఆశిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ల సలహామేరకు ఆమె నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పదేండ్ల తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సమయంలో తాను సీఎంగా ఉండటం, ఘనంగా ఉత్సవాలు నిర్వహించడమనేది తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ వ్యాపారంగా వాడుకున్నారని విమర్శించారు. రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే అంశంపై శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నదే తమ అభిమతమన్నారు. కాళేశ్వరం వద్ద అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డ అంశంపై ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయమై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విచారణాధికారిలా మాట్లాడు తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీ శాట్‌ ద్వారా నిపుణులతో విద్యా బోధన చేస్తామన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఆ సంస్థ సీఈవోను ఆదేశించారు.రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కోతలు ఉన్నాయని మాట్లాడిన వారికి కరెంట్‌ షాక్‌ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు, ఎండలతో కరెంట్‌ వినియోగం పెరిగిందన్నారు. దీంతో ట్రాన్స్‌ఫారమ్‌లపై లోడ్‌ ఎక్కువగా ఉంటోందన్నారు. కరెంట్‌ కోతలు ఉన్నట్టు నిరూపించాలని బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరారు. ఈ విషయంలో కేసీఆర్‌ మైండ్‌ దొబ్బిందన్నారు. అధికారం కోల్పోవడంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. విద్యుత్‌ సమస్యలపైన బహిరంగ చర్చకు సిద్ధమేనని కెేటీఆర్‌, హరీశ్‌రావులకు రేవంత్‌ సవాల్‌ విసిరారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే వారు మరో రకం బ్రాండ్‌ పత్తి విత్తనాలను అడుగుతున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ తర్వాత విత్తనాలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు భరోసా విషయమై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అనేక భూముల్లో ప్లాట్లు అయ్యాయనీ, రాళ్లు, రప్పలు ఉన్న భూములకు ఇవ్వకూడదనేది తమ విధానమన్నారు. ఉద్యోగులకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలనుకుంటే, ముందుగా సీఎం, మంత్రులు, సీఎస్‌, కార్యదర్శులు, సచివాలయ అధికారులకు బయో మెట్రిక్‌ అమలు చేస్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించామని, ఆమె ఆరోగ్యం బాగుంటే వస్తారని తెలిపారు. సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ విగ్రహ రూపకల్పన బాధ్యతలను ఫైన్‌ ఆర్ట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ను అప్పగించినట్టు రేవంత్‌ తెలిపారు. ఇప్పటికే టీఎస్‌ను టీజీగా మార్చుకున్నామని తెలిపారు.
ఈ విషయంలో ఏ రాష్ట్రానికి లేని విధానాన్ని నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆదివారం విడుదల చేస్తామని సీఎం రేవంత్‌ అన్నారు. జయ జయహే పాట విషయంలో పూర్తి బాధ్యతను రచయిత అందే శ్రీకి అప్పగించామనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా ఆయన్ను సంప్రదించాలని కోరారు. ఆ పాట పాడటంలో వ్యక్తుల ప్రమేయం లేదనీ, సామూహికంగా పాడారని తెలిపారు. ఆ పాటను ఎవరూ పాడారో తెలియకుండా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నాన్ని ఆవిష్కరిస్తామన్నారు. అమరవీరులను గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి, వారి కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రూ.1000 కోట్లతో అమరవీరుల స్థూపం కట్టాలంటూ గతంలోనే తాను డిమాండ్‌ చేసిన విషయాన్ని రేవంత్‌ గుర్తు చేశారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన రాజులుగానే తాను కాకతీయులను చూస్తానని ఈ సందర్భంగా రేవంత్‌ చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కేసీఆర్‌ రావాల్సి ఉందన్నారు. ఆయనకు రాష్ట్ర అవతరణ దినోత్సవంపై గౌరవం లేదని విమర్శించారు. దేశ స్వాతంత్య్రాన్ని పాకిస్తాన్‌ ఒక రోజు ముందుగా వేడుకలు చేసినట్టుగానే… కేసీఆర్‌ కూడా ఒక రోజు రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తామంటే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని విమర్శించారు.
వేడుకలకు అందరినీ ఆహ్వానించామని తెలిపారు. అమరుల త్యాగాలు, అమరుల స్థూపం అంటే బీఆర్‌ఎస్‌కు లెక్కలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాంపై బీఆర్‌ఎస్‌ తన అభిప్రాయాన్ని సబ్‌ కమిటీకి తెలపకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడాన్ని బట్టి ఆపార్టీ నేతలు వైఖరేంటో అర్థమైందన్నారు. ఇంకా వారిని అడిగేదేమున్నదని అన్నారు. రాష్ట్రంలో విద్య, క్రీడలను ప్రోత్సహించాలని భావిస్తున్నామని తెలిపారు. బీసీల కులగణ చేపట్టేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌లను ఏర్పాటు చేస్తామనీ, వారంలో ఒకరోజు ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో ఫుట్‌ బాల్‌ ఆడుతారని తెలిపారు.

Spread the love