అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థి కారుపై కాల్పులు..

నవతెలంగాణ – వాషింగ్టన్‌: అమెరికాలో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థి కాల్పుల్లో మరణించాడు. అతడు డ్రైవ్‌ చేసిన కారుపై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో కారులో పడి ఉన్న అతడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల ఆదిత్య అద్లాఖా, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాట్‌ మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌లో నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. నవంబర్‌ 9న వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్‌ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన కారు ఒక గొడను ఢీకొట్టింది. కాగా, కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్‌ గాయాలతో కారులో కుప్పకూలి ఉన్న ఆదిత్యను వెంటనే యూసీ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల తర్వాత మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదిత్య నడిపిన కారు, అద్దాలకు బుల్లెట్‌ రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు కాల్పుల్లో ఆదిత్య చనిపోవడం పట్ల యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాట్‌ మెడికల్ స్కూల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Spread the love