ఆస్ట్రేలియాలో భారత విద్యార్ధి హత్య

– నిందితులుగా అనుమానిస్తున్న మరో ఇద్దరి కోసం గాలింపు
మెల్‌బోర్న్‌, చండీగడ్‌: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధి ఒకరు కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ హత్యతో సంబంధముందని భావిస్తున్న మరో ఇద్దరు భారతీయుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి అద్దె విషయమై స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడు నవజీత్‌ సంథు(22)కు ఈ గొడవకు అసలు సంబంధం లేదు. వారిని ఘర్షణ పడవద్దని వారించినందుకే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. హర్యానాలోని కర్నాల్‌కి చెందిన నవజీత్‌ చదువు కోసం ఏడాదిన్నర క్రితం ఆస్ట్రేలియా వచ్చాడు. ఈ ఏడాది జులైలో శలవుల కోసం స్వదేశానికి రావాల్సి వుంది. ఈలోగానే ఇంత ఘోరం జరిగింది. వేరే చోటకు ఇల్లు మారదామనుకున్న నవజీత్‌ స్నేహితుడు (మరో భారతీయ విద్యార్ధి) తన సామాన్లతో కొత్త ఇంటికి తీసుకెళ్ళడానికి సాయం చేయాల్సిందిగా నవజీత్‌ను అడిగాడు. కారులో ఫ్రెండ్‌ను తీసుకెళ్ళడానికి వచ్చిన నవజీత్‌కు లోపల ఇంట్లో నుండి అరుపులు వినిపించడంతో లోపలకు వెళ్ళి అక్కడ ఘర్షణ పడుతున్న వారిని అడ్డుకోబోయాడు. వెంటనే ఛాతీలో తీవ్రంగా కత్త్తితో పొడవడంతో నవజీత్‌ చనిపోయాడని, అతడి స్నేహితుడు కూడా గాయపడ్డాడని నవజీత్‌ మావయ్య యశ్వీర్‌ తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున తమకు సమాచారం అందిందని చెప్పారు. నిందితులుగా భావిస్త్నువారు కూడా కర్నాల్‌కి చెందినవారేనని తెలిపారు. నవజీత్‌ చాలా తెలివైన విద్యార్ధి అని చదువు కోసం తండ్రి ఎకరంన్నర పొలాన్ని అమ్మి మరీ ఆస్ట్రేలియా పంపించారని, ఈలోగా ఈ ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు యశ్వీర్‌ తెలిపారు. తెల్ల టయోటా కారులో సోదరులు అభిజిత్‌, రాబిన్‌ గర్టన్‌ ఇరువురు పారిపోయారని, వారి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారని యశ్వీర్‌ చెప్పారు.

Spread the love