ఉపాధే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ

Industrial policy aimed at employment– తుది దశకు చేరిన కసరత్తు
– సహజ వనరుల ప్రాతిపదికగా పరిశ్రమల ఏర్పాటు
– యువ పారిశ్రామికవేత్తలకు తొలి ప్రాధాన్యత
– కార్పొరేట్‌ సంస్థల్లో 40 శాతం ఉద్యోగాలు స్థానికులకే…
– ‘దావోస్‌’ డిమాండ్లూ పరిగణనలోకి…
‘పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక విధానం ఉండొద్దు. కచ్చితంగా స్థానిక యువతరానికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. రాష్ట్రంలో స్థాపించే ప్రతి కార్పొరేట్‌ కంపెనీలో తప్పనిసరిగా 40 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. సులభతరమైన, సింగిల్‌విండో పద్ధతిలో పారిశ్రామిక విధివిధానాల రూపకల్పన జరగాలి. ఉద్యోగులు, కార్మికుల హక్కులకు భంగం కలగొద్దు. ఉమ్మడి జిల్లాల్లోని సహజవనరుల ఆధారంగా జోనల్‌ పద్ధతిలో పరిశ్రమల ఏర్పాటు జరగాలి. దీనిలో స్వరాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యాంకుల రుణ పరపతి సౌకర్యాలను మరింత సరళీకరించాలి. దీనికోసం అవసరమైతే పారిశ్రామిక చట్ట సవరణలు కూడా చేద్దాం’… ఇవీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పారిశ్రామిక విధానాల మౌలిక లక్ష్యాలు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తయారవుతున్న విధివిధానాలపై అధికారుల కసరత్తు పూర్తయ్యింది. వీటికోసం రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాల నుంచి పరిశ్రమల శాఖ అభిప్రాయ సేకరణ జరిపింది. అన్ని రకాల పరిశ్రమల్ని ఒకే గాటన కట్టేయకుండా, వేర్వేరుగా విధివిధానాలు రూపొందిస్తున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) పాలసీ, ఎక్స్‌పోర్ట్‌ పాలసీ, న్యూ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, రివైజ్డ్‌ ఈవీ పాలసీ, మెడికల్‌ టూరిజం పాలసీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలను ప్రభుత్వం రూపొందిస్తున్నది. వీటితో పాటు టెక్స్‌టైల్‌ పరిశ్రమకు ప్రత్యేకంగా మరో పాలసీని తయారుచేస్తున్నారు. ఇప్పుడున్న పాలసీలకంటే భిన్నంగా, మరింత సరళీకరిస్తూ విధివిధానాలకు రూపకల్పన జరుగుతున్నది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఆయా జిల్లాల్లోని వనరులను బట్టి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 7 లక్షల మంది పారిశ్రామికవేత్తలు ఉండగా, 40 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త పాలసీల రూపకల్పనలో ఉన్న పరిశ్రమల విస్తరణ, కొత్త పరిశ్రమల స్థాపనను సులభతరం చేసేలా మార్గదర్శకాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఇటీవల ఆయన దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సుకు హాజరై, రాష్ట్రానికి రూ.40వేల కోట్ల విలువైన పరిశ్రమల స్థాపన, విస్తరణకు ఒప్పందాలు చేసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న విధానాలతో వీటి ఏర్పాటు అలస్యం అవుతుందనీ, విధివిధానాలను సరళీకరిస్తూ రూపొందిస్తే, అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. పారిశ్రామిక వేత్తల షరతులను పరిగణనలోకి తీసుకుంటూనే రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, సంస్థల్లో కనీసం 40 శాతం ఉద్యోగావకాశాలు స్థానిక యువతీయువకులకు ఇవ్వాలనే కండీషన్‌ను తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించినట్టు పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి. భూముల కేటాయింపు, క్లష్టర్ల ఏర్పాటు, మౌలిక సౌకర్యాల కల్పన కోసం స్టేట్‌ పైనాన్స్‌ కార్పొరేషన్‌, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థల్ని పునరుత్తేజం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే పరిశ్రమలకు సంబంధించిన అన్ని వ్యవస్థల్నీ ఒకే గొడుగు కిందికి తెస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే బ్యాంకర్లు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా నిర్థారించిన పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించి, వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. పరిశ్రమల శాఖ రూపొందిస్తున్న విధివిధానాల్లో ఈ అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల్ని పెట్టుబడిదారుల కోణంలో కాకుండా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కర్మాగారాలుగా చూసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 43 శాతం అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమలు, టెక్స్‌టైల్‌, మినరల్‌ బేస్డ్‌ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, బయోటెక్‌ రంగాలతో పాటు గాజులు, ఇతర అభరాణాలు, అలంకార ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కరీంనగర్‌లో బొగ్గు ఆధారిత పరిశ్రమలతో పాటు వాణిజ్య పంటలు, నూనె ఉత్పత్తి కేంద్రాలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ఖమ్మంలో ఐరన్‌ ఓర్‌, బొగ్గు, కాపర్‌, గ్రానైట్‌, ఖనిజాలకు సంబంధించిన పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, చిరుధాన్యాల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తారు. మెదక్‌ జిల్లాలో చెరుకు, మొక్కజొన్న, గోధుమలు, మిర్చి, మామిడి, బొప్పాయి వంటి ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తారు. దానికోసం నేషనల్‌ మ్యానుఫాక్చరింగ్‌ పాలసీలో భాగంగా 13,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యానుఫాక్చరింగ్‌ జోన్స్‌ (నిమ్జ్‌)లో అనుమతులు ఇస్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడికక్కడ లభించే ఉత్పత్తుల అధారంగా పరిశ్రమల స్థాపన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. విధివిధానాల రూపకల్పన తుది దశకు చేరింది. వచ్చే రెండు వారాల్లో సీఎం రేవంత్‌రెడ్డితో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యి ముసాయిదాపై చర్చించనున్నారు. ఆ తర్వాత పారిశ్రామిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
రీయింబర్స్‌మెంట్లు వద్దు
ఏపీకే రెడ్డి, అధ్యక్షులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ)
పారిశ్రామిక విధివిధానాల రూపకల్పనలో రీయింబర్స్‌మెంట్‌ విధానం వద్దు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఇచ్చే రాయితీలు ఏనాడూ సకాలంలో యాజమాన్యాలకు అందలేదు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల రాయితీలు దాదాపు రూ.3,700 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికీ ఇవి విడుదల కాలేదు. అందువల్ల ప్రభుత్వం ఇస్తామన్న రాయితీలను నేరుగా ఆయా శాఖలకే చెల్లించాలి. విద్యుత్‌, నీటి చార్జీల్లో ఇచ్చే రాయితీలు ఆ శాఖలకే ఇవ్వాలి. వాటిని మినహాయించే పరిశ్రమలకు బిల్లులు ఇవ్వాలి. అలాగే రిజిస్ట్రేషన్‌ చార్జీల్లో రాయితీలను ఆ శాఖకు నేరుగా చెల్లించాలి. ఇలా పరిశ్రమలకు అనుబంధమైన అన్ని రాయితీలు ప్రభుత్వమే ఆయా శాఖలకే నేరుగా చెల్లిస్తే, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన సులభతరం అవుతుంది. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆయా వృత్తివిద్యా కళాశాలల్లోనే విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇవ్వాలి. చదువులు పూర్తయ్యి, బయటకు వచ్చాక మళ్ళీ శిక్షణ పేరుతో కాలయాపన చేయోద్దు. యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా, వారు కళాశాలల్లో చదువుతున్నప్పుడే బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. దీనివల్ల స్థానిక యువతరం పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారు. పారిశ్రామికరంగంలో ఎలాంటి మార్పులు రావాలనే దానిపై ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ తరఫున తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్‌కు పూర్తివివరాలతో 40 పేజీల ప్రతిపాదనల్ని ఇచ్చాం. వాటిలో సింహభాగాన్ని ఆమోదిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకోవడం ఆ రంగం అభివృద్ధిలో ముందడుగు పడటమే!

Spread the love