నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్, బషీరాబాద్ గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను బుధవారం పంచాయతీ ప్రత్యేక అధికారులు సందర్శించి పరిశీలించారు. నాగపూర్ లో పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, బషీరాబాద్ లో పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ మైలారం గంగాధర్ నర్సరీలను సందర్శించి పరిశీలించారు. వేసవి ఎండలు ముదురుతున్నందున నర్సరీల్లో మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో నీటిని అందించాలని నర్సరీల నిర్వహకులకు సూచించారు. ఎండల నుండి మొక్కలను కాపాడేందుకు షెడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కల సంరక్షకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా మొక్కలు ఎండిపోతే తక్షణమే వాటి స్థానంలో కొత్త మొక్కలను సిద్ధం చేయాలన్నారు. నర్సరీలో మొక్కల పెంపకంలో అలసత్వం చూపొద్దని, నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా నర్సరీల నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంధ్య, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.