– సెన్సెక్స్‌కు 102 పాయింట్ల నష్టం
ముంబయి: అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 102 పాయింట్లు కోల్పోయి 80,502 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 24,509 వద్ద నమోదయ్యింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపటికే కోలుకున్నప్పటికీ.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,800 – 80,100 మధ్య కదలాడింది. దాదాపు 1953 షేర్లు రాణించగా.. 1575 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా.. మరో 116 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి. నిఫ్టీలో విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండిస్టీస్, ఐటిసి, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. గ్రాసిమ్ ఇండిస్టీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, ఇన్ఫోసిస్ సూచీలు అధికంగా లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.3 శాతం, 0.85 శాతం చొప్పున లాభపడ్డాయి.