డ్రగ్స్‌ కేసులో చేతివాటం

Involvement in drug case– రాయదుర్గం ఎస్‌ఐ అరెస్ట్‌
నవతెలంగాణ-మియాపూర్‌
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ రాజేందర్‌ డ్రగ్స్‌ కేసులో చేతివాటం ప్రదర్శించి అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది. డ్రగ్స్‌ సరఫరాపై సైబరాబాద్‌ పోలీసులు ఓ వైపు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు సైబరాబాద్‌ పరిధిలోనే పనిచేస్తున్న పోలీసులు డ్రగ్స్‌ సరఫరాలో కీ రోల్‌ పోషిస్తున్నారు. నార్కోటిక్‌ విభాగం అధికారులు వలపన్ని పట్టుకోవడంతో అతడి అవినీతి బయటపడింది. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో (సీసీఎస్‌) నార్కోటిక్‌ టీమ్‌లో రాజేందర్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో చేసిన ఓ అపరేషన్‌లో పాల్గొన్న రాజేందర్‌ అక్కడ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన డ్రగ్స్‌ను కోర్టులో డిపాజిట్‌ చేసే సమయంలో తక్కువగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎస్‌ఐ రాజేందర్‌ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు అక్కడ సుమారు 1,750గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ రాజేందర్‌పై రాయదుర్గం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నట్టు సమాచారం. రాయదుర్గం ఎస్‌ఐగా పనిచేస్తున్నప్పుడు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతన్ని సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉతఉ్వలు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్తర్వులపై కోర్టు నుంచి రాజేందర్‌ స్టే తెచ్చుకున్నారు.

Spread the love