ముందస్తు నోటీసు లేకుండా ఓట్లను తొలగించొద్దు : సీఈవో సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒక పౌరుడికి ఒకే ఓటు అనేది ప్రజా స్వామ్యానికి ప్రాథమిక సూత్రమని బీఆర్‌ఎస్ తెలిపింది. డూప్లికేట్, బోగస్ ఓట్ల అక్రమాలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు “ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ” (సర్)పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ని మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతల బృందం కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. ఈ ప్రతినిధి బృందంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, నాయకులు రవి నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోగస్ ఓటర్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా బద్దలు కొడతామని అన్నారు. ఒక ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్టు రుజువైతే ఉంటే ఏడాదిపాటు జైలు శిక్ష విధించాలని కోరారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నారని అన్నారు.
ఇక్కడ, వారి స్వస్థలాల్లో కూడా ఓటును కొనసాగిం చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని చెప్పారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఇతర రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుని ఇలాంటి ‘డబుల్ ఓటింగ్’ విధానాన్ని పూర్తిగా తొలగించాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఇచ్చిన 30 వేల దొంగ ఓట్ల జాబితా ఆధారంగా అధికారులు ఆరు వేల బోగస్ ఓట్లను తొలగించారని గుర్తుచేశారు. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్షేత్రస్థాయి పరిశీలన జరగాలని అన్నారు. సర్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ముందస్తు నోటీసు, చట్టబద్ధమైన విచారణ లేకుండా ఏ ఒక్క నిజమైన ఓటరు పేరును తొలగించకూడదని డిమాండ్ చేశారు. చేర్పులు, తొలగింపుల సమాచారాన్ని రాజకీయ పార్టీలకు సకాలంలో అందించాలని కోరారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వో), పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బోగస్ ఓట్ల అక్రమాలను సహించేది లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



