Tuesday, August 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగు నీటిని విడుదల చేయాలి

ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగు నీటిని విడుదల చేయాలి

- Advertisement -

రైతులు గోస పడుతున్నా.. 
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
రుణమాఫీ, రైతు బీమా ఎగొట్టి మోసం: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్

ఎస్సారెస్పీ కాలువ ద్వారా మైలారం రిజర్వాయర్, అలాగే రాయపర్తి, తొర్రూరు మండలాల చెరువులకు సాగు నీరందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు అన్నారు. కండ్ల ముందే వందల ఎకరాలు సాగు చేయకుండా పొలాలను పక్కన పెట్టినా, సాగు వేసిన వరికి నీరందక ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు నీరు విడుదల చేసి ఆదుకోవాలనే చిత్త శుద్ది లేదని మండిపడ్డారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌ మండలం నాంచారి మడూరు ఎస్సారెస్పీ కాలువ వద్ద రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. వర్షాకాలంలో కాలువ వస్తుందనే ఆశతో రైతులు వరి నాట్లు వేశారని, ఇప్పుడు నీరు రాకుంటే రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వరి నాట్లు వేసిన రైతుల పంటలు ఎండి పోయే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం నీరు విడుదల చేయడం లేదన్నారు. రోజుకో సభ పేరిట ప్రజా సొమ్ము గుల్ల చేసుడు తప్ప రైతులకు ఏం చేయాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు రైతులకు భారంగా మారాయని తెలిపారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, సాగునీరందించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. రైతుబంధు ఎగొట్టి ఇప్పటికే ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని వాపోయారు. యూరియా దొరక్క, కరెంట్ కష్టాలతో ఇప్పటికే రైతులు ఆగమతున్నా రని తెలిపారు. రుణమాఫీ సక్రమంగా అమలు జరగక మోసపోయిన రైతులను మళ్ళీ రైతు భీమా ఎగొట్టి మోసం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. 14న రైతు భీమా ప్రీమియం చెల్లింపునకు గడువు ముగిసినా.. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని ఎద్దేవా చేశారు. పండిన పంటకు బోనస్ ఇయ్యాల్సివస్తుందని, రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను ఆదుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -