హీరో రవి తేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘ఇరుముడి`. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమ పాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించ బోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఈనెల 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని చిన్నారి కుమార్తె పోస్టర్‌లో కనిపిస్తూ, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ పోస్టర్ వారి ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది.



