నేలనడగటమే నేరమా..?

 Sampadakiyamమాది ప్రజా ప్రభుత్వమంటూ జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వాధినేతలు.. ప్రజలు, అందునా కడు పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యమంటూనే బీదాబిక్కీ కంటనీరొలికిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తాజాగా పేదల గుడిసెలపై పోలీసుల జులుం… సర్కారు దాష్టీకానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రతీ పౌరుడికీ కూడు, గూడు, గుడ్డ కల్పించటమే తమ ధ్యేయమని చెబుతున్న పాలకులకు పేదల గోడు పట్టడం లేదు. గత గులాబీ సర్కారైనా.. నేటి హస్తం పార్టీ అయినా ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లంటూ ఊదరగొట్టటమే తప్ప ఆచరణలో ఆయా పథకాలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు పేదోడికి సొంతింటి కల కలగానే మిగిలి పోయింది. ఉమ్మడి రాష్ట్రం పోయి తెలంగాణ వస్తే తమకు సొంత గూడు దక్కుతుందనుకున్న సామాన్యుడి ఆశ… అడియాశే అయింది. రాష్ట్రాన్ని పదేండ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌… తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,80,616 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 18,520 కోట్లను కేటాయిస్తామని హామీనిచ్చింది. కానీ ఆచరణలో డబ్బులు విడుదల చేయకపోవటంతో ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. కేసీఆర్‌ సర్కారు అనుకున్న లక్ష్యంలో యాభై శాతం కూడా పూర్తి కాలేదు. నిర్మాణాలు సక్రమంగా లేకపోవటం, నాసిరకం మెటేరియల్‌ వాడటంతో కట్టిన ఇండ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం… ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని తిరిగి కొనసాగిస్తామని ప్రకటించింది. ఆ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు. నియోజక వర్గానికి 3,500 చొప్పున 110 నియోజకవర్గాలకు మొత్తం 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీనిచ్చారు. హస్తం పార్టీ అధికార పీఠమెక్కి 17 నెలలు గడిచిపోయాయి. ప్రజా పాలన కార్యక్రమం కింద రెండుమూడు దఫాలు అర్జీలు స్వీకరించటం పూర్తయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల రికమండేషన్లతోనే ఇండ్ల కేటాయిం పు జరుగుతోంది తప్ప అందులో పారదర్శకత లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మళ్లీ ఇప్పుడు పేదల్లో పేదలకే ఇందిరమ్మ ఇండ్లంటూ ఏలికలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బేస్‌మెంట్‌ పూర్తి చేసిన వారికి తొలి విడతలో రూ.లక్ష ఇస్తామంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి సెలవిచ్చారు. కానీ ప్రస్తుతం పెరిగిన మెటీరియల్‌ ధరలతో ఈ మొత్తం దేనికి సరిపోతుందో ప్రభుత్వం వారే చెప్పాలి.
పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టే… పేదలు తమ గూడును తామే వెతుక్కుంటున్నారు. పాలకుల హామీలకు, వారి చేతలకు పొంతన లేకుండా పోయింది కాబట్టే… ఎర్రజెండాల అండతో ఖాళీ జాగాల్లో గుడిసెలేసుకుని జీవిస్తున్నారు. ఆ రకమైన అండతోనే మహబూబాబాద్‌లో మూడేండ్ల నుంచి రెండు వేల మంది పేదలు గుడిసెలేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపాల్టీ అధి కారులు మూకుమ్మడిగా ఇరవైసార్లు దాడి చేసినా అదరకుండా, బెదరకుండా, వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారు. అయినా కబ్జారాయుళ్లు, రియల్‌ ఎస్టేట్‌ పెద్దలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం… మరోసారి గుడిసెవాసులపై కన్నెర్రచేసింది. పిల్లలు, మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించింది. గతంలోని గులాబీ సర్కార్‌ ఇలాంటి చర్యలకే పూనుకోగా… ఎర్రజెండా ప్రతిఘటించింది. పేదలకు అండగా నిలిచింది. పేదలపై పెట్టిన కేసులు ఎత్తేయాలనీ, గుడిసెవాసులకు పట్టాలిచ్చి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నేటి ముఖ్యమంత్రి రేవంత్‌కు సైతం వినతిపత్రాలిచ్చింది. కేసులెత్తేయటంపై హామీనిచ్చిన సీఎం, పట్టాలపై మాత్రం పెదవి విప్పలేదు. కాగా మరోసారి పేదలపై ఖాకీలు దాష్టీకాన్ని ప్రదర్శించటం గమనార్హం. ఒకవైపు ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒరిస్సా తదితర రాష్ట్రా ల్లోని అటవీ ప్రాంతాల్లోగల విలువైన ఖనిజ సంపదపైన కన్నేసిన కేంద్రం… అక్కడ మావోయిస్టుల బూచి చూపి అరాచకాన్ని సృష్టిస్తోంది. తద్వారా అమాయక గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొట్టి, ఆ సంపదను కార్పొరేట్‌ గద్దలకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతోంది. మరోవైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను తనఖా పెట్టేందుకు, అవసరమైతే తెగనమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. పాలకుల విధానాలు ఈ విధంగా ఉన్నప్పుడు పేదోడికి జానెడు జాగా ఎక్కడ దొరుకుతుంది..? బీదాబిక్కీకి ఇండ్లు, ఇంటి జాగాలు దక్కాలంటే పోరుబాటే మార్గం.

Spread the love