పాలస్తీనాకు మద్దతివ్వడమే నేరమా !

పాలస్తీనాకు మద్దతివ్వడమే నేరమా !– భారత సెలబ్రిటీలే లక్ష్యంగా మితవాద పక్షాలు
– వేధింపులు, బెదిరింపులతో ట్రోలింగ్‌
న్యూఢిల్లీ : గత 8 మాసాలుగా గాజాలో సాగుతున్న నరమేధంపై ప్రపంచ ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, శాశ్వతంగా శాంతిని నెలకొల్పాలని అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆదేశాలు, విజ్ఞప్తుల రూపంలో ఎన్నిసార్లు కోరినా ఇజ్రాయిల్‌ మొండిగా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మే 26వ తేదీన రఫాలోని నిర్వాసితులు తలదాచుకున్న తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయిల్‌ ఆర్మీ విరుచుకుపడింది. ఆ ఘటనలో 45మంది మరణించారు. పెద్ద ఎత్తున లేచిన మంటలు, మాడిపోయిన మృతదేహాలు, తల లేని పిల్లాడి మృతదేహం వంటి భయానకమైన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వాటిని చూసి ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సోషల్‌ మీడియా వ్యాప్తంగా తమ నిరసనలు, ఆందోళనలను పంచుకున్నారు. ఈ తరుణంలోనే ”ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా” పేరుతో ఎఐ సృష్టించిన గ్రాఫిక్‌ బాగా వైరల్‌ అయింది. 4కోట్ల సార్లకు పైగా దీన్ని షేర్‌ చేసుకున్నారు. రఫా నగరంపై దాడి చేస్తున్న ఇజ్రాయిల్‌ బలగాలకు ఒక హెచ్చరికగా ఈ గ్రాఫిక్‌ను తీసుకువచ్చారు. సోషల్‌ మీడియా వ్యాప్తంగా సాగిన ఈ ప్రచారంలో పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలతో సహా భారత్‌ సెలబ్రిటీలు పలువురు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియచేశారు. సోషల్‌ మీడియా యూజర్లు ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్‌ తీరును ప్రశ్నిస్తూ, ఖండిస్తూ ఆ గ్రాఫిక్‌ను ఇతరులతో పంచుకున్న భారత సెలబ్రిటీలను మితవాద విభాగానికి చెందిన ఇన్‌ఫ్లూయన్సర్లు, ప్రచారకర్తలు బాగా లక్ష్యంగా చేసుకున్నారు. వారిని బెదిరించడం ఆరంభించారు. ఆన్‌లైన్‌ వేదికగా వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు రఫాపై ఇంతలా గళమెత్తి ప్రశ్నిస్తున్న వారు గతంలో పాకిస్తాన్‌లో హిందువులపై జరిగిన వేధింపుల సమయంలో, అలాగే కాశ్మీరీ పండిడ్లపై జరిగిన దాడులు, వేధింపులపై ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా అన్న గ్రాఫిక్‌లో రఫా స్థానంలో పిఓకె, పాకిస్తానీ హిందూస్‌ అనే పదాలను చేర్చి ఆన్‌లైన్‌లో ప్రచారం చేశారు. మరికొంతమంది రఫాపై వ్యక్తమవుతున్న సంఘీభావాన్ని కూడా మీమ్స్‌ రూపంలో తీసుకువచ్చారు.
ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలను చూద్దాం :
భారత్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ భార్య రితికా సజ్దా ఈ గ్రాఫిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసి తర్వాత సోషల్‌ మీడియాలో వచ్చిన మితవాదుల ట్రోలింగ్‌ను భరించలేక దాన్ని తొలగించారు. తప్పుడు సమాచారాన్ని తన సోషల్‌ మీడియా వేదికగా తరచుగా ప్రచారం చేసే దీపక్‌ శర్మ అనే వ్యక్తి రోహిత్‌ శర్మకు, భార్య రితికకు హెచ్చరిక చేశారు. ‘తీవ్రవాదులు, ఆటవిక కృత్యాలకు పాల్పడుతున్న వారికి మద్దతుగా పోస్టులు పెడుతూ నీ భార్య తప్పు చేస్తోంది. అయినా ఏదో నాలుగు రూపాయిలు సంపాదించుకోవడానికా ఆమె ఇలాంటి పోస్టులు పెడుతోంది, ఆమెకు నువ్వు డబ్బులు ఇవ్వడం లేదా అంటూ తీవ్ర పదజాలంతో ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇది మొదటి తప్పు అనుకుని క్షమించి వదిలేస్తున్నాం, మరోసారి జరిగితే తీవ్ర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించారు. భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కూడా ఇదే గ్రాపిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. వెంటనే మితవాద విభాగాల నుండి తీవ్ర స్థాయిలో విద్వేషాలు వెల్లువెత్తాయి. మోనా ఎట్‌ లేడీ నేషనలిస్ట్‌ అనే ఎక్స్‌ యూజర్‌ సిరాజ్‌ పంచుకున్న స్టోరీపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ”వారిని మీరు ఎంతగా సొంతం చేసుకున్నా, చివరకు వారు వారి అసలైన స్వభావాన్ని బయటపెట్టుకుంటారు.” అని హిందీలో పేర్కొన్నారు. మిగిలిన అనేకమంది సెలబ్రిటీలన కూడీ ఈ యూజర్‌ లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారిని లేదా ముస్లింలతో సంబంధమున్న వారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎంపి మనోజ్‌ తివారీ కుమార్తె, ఇటీవలే బిజెపిలో చేరిన రితి తివారీ కూడా ఈ గ్రాఫిక్‌ను షేర్‌ చేసి పోస్టు పెట్టారు. పిల్లల తలలు కోసి, వారిని సజీవంగా సమాధి చేయడంతో సహా లెక్కలేని అత్యాచారాలు, అకృత్యాలకు పాల్పడుతున్న ఈ దుష్టత్వాన్ని ఖండిస్తూ, అందరిలో చైతన్యం తీసుకురావడానికి మన గళాన్ని వినిపించాలి, మనకు న్యాయం కావాలి, ఇందుకోసం తిరగబడాలి అని పేర్కొన్నారు. అయితే మితవాదుల నుండి తీవ్రంగా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తడంతో తన ఇన్‌స్టా పేజీ నుండి ఆ పోస్టును తొలగించారు. ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని సమర్ధించేవారు బిజెపిలో వుండడం సిగ్గుచేటైన విషయమంటూ మితవాద ఇన్‌ఫ్లూయన్సర్‌ షఫాలి వైద్య ఒక వీడియో కూడా షేర్‌ చేశారు. రితి తివారిని బెదిరిస్తూ అనేకమంది పోస్టులు పెట్టారు. మరోపక్క బాగా వైరల్‌ అయిన ఈ గ్రాఫిక్‌నే మరో రకంగా ఉపయోగించుకున్నారు . కర్ణాటకకు చెందిన బిజెపి ఎంపి పి.సి.మోహన్‌. ”(ఆయేగా తో మోడీ హై) మోడీ విల్‌ బి బేక్‌” అని మార్చి ఆ గ్రాఫిక్‌ను షేర్‌ చేశారు.
దీన్ని బిజెపి ఎంఎల్‌ఎ అతుల్‌ భత్కాలక్కర్‌, మితవాద ఇన్‌ఫ్లూయన్సర్‌ రిషి బాగ్రీలతో సహా పలువురు యూజర్లు తమ సోషల్‌ మీడియా హేండిల్‌పై షేర్‌ చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఇంతలా రగడ జరుగుతున్న నేపథ్యంలో మే 30వ తేదీన కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పాలస్తీనాపై భారత్‌ వైఖరిని పునరుద్ఘాటించారు.
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలన్నదే భారత్‌ వైఖరి అని స్పష్టం చేశారు. అయితే గాజాలో దాడులు ప్రారంభమైనప్పటి నుండి బిజెపి, ప్రధాని మోడీ మద్దతుదారులతో సహా మితవాద గ్రూపులు ఇస్లామోఫోబియాను రెచ్చగొట్టడానికి దీన్నొక అవకాశంగా మలుచుకున్నారు. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ సాగించే యుద్ధ నేరాలకు మద్దతుగా మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. గాజా నరమేథంలో బలైన వారిని అపహాస్యం చేసేలా, అమానవీయంగా చిత్రీకరిస్తూ పిచ్చి ఆనందం పొందుతున్నారు.

Spread the love