Monday, May 18, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పై చిత్తశుద్ధేది?

నీట్ పై చిత్తశుద్ధేది?

- Advertisement -

ఆ విభాగంలో సగం పోస్టులు ఖాళీ
అమల్లోకి రాని ఇస్రో మాజీ చీఫ్ 
కె. రాధాకృష్ణన్ సిఫారసులు
తరచూ పోటీ పరీక్ష‍ల ప్రశ్నా పత్రాల లీకేజీలు
వ్యవస్థను సరిదిద్దకుండా..తాత్కాలికి ఉపశమన చర్యలు
అందోళనలో అభ్యర్థులు

న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం తర్వాత పరిపాలనా సంస్కరణలు ప్రారంభిం చినప్పటికీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అగ్రస్థాయిలో తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. 2024 పేపర్ లీక్ తర్వాత, ఏజెన్సీలో 16 కొత్త సీనియర్ పదవులను సృష్టించారు, కానీ వీటిలో సగం పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఇటీవల 2026 నీట్-యూజీ పేపర్ లీక్ తర్వాత, కేంద్ర ప్రభుత్వం నలుగురు కొత్త సీనియర్ అధికారులను నియమించింది. కానీ ఇది ఏజెన్సీలో ఉన్న నిర్మాణాత్మక సవాళ్లను పూర్తిగా పరిష్కరిం చలేకపోతోంది.

కొత్త అధికారులు వీరే…
ప్రభుత్వం 1998 బ్యాచ్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) అధికారిణి అనుజా బాపత్‌ను, 2004 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిణి రుచితా విజయ్‌ను ఎన్టీఏ లో జాయింట్ సె క్రెటరీలుగా నియమించింది. అదనంగా 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్ ) అధికారి ఆకాష్ జైన్ , ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (ఐఏఅండ్ ఏఎస్) అధికారి ఆదిత్య రాజేంద్ర భోజ్‌గడియా కేంద్ర డిప్యుటేషన్‌పై జాయింట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

రాధాకృష్ణన్‌ ‌కమిటీ నివేదిక
2024 అక్టోబర్‌లో నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్టీఏ నిర్మాణంలో ప్రధాన మార్పులు జరిగాయి. ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఈ ఏజెన్సీలో సమగ్ర సంస్కరణలను సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ఆధారంగా ఎనిమిది డైరెక్టర్ , మరో ఎనిమిది జాయింట్ డైరెక్టర్ స్థాయి పోస్టులతో సహా మొత్తం 16 కొత్త పోస్టులను సృష్టించారు. ఎన్టీఏలో ఒక్కో డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో 10 ఫంక్షనల్ వర్టికల్స్‌ను ఏర్పాటు చేయడం, శాశ్వత , జవాబుదారీ సిబ్బంది వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి అవసరాలను కూడా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది.

పోస్టులు ఖాళీ
ఈ ఏజెన్సీని పర్యవేక్షించడానికి ఒక బలమైన పాలక మండలిని ఏర్పాటు చేయాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. అయితే, సంస్కరణల ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. 2025 మార్చిలో రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం, ఎనిమిది జాయింట్ డైరెక్టర్ స్థాయి పదవులలో మొదటి మూడు పోస్టుల్ని అర్చన శుక్లా, అమిత్ కుమార్ , శివాని (2024 డిసెంబర్ లో) పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆకాష్ జైన్ , ఆదిత్య రాజేంద్ర భోజ్‌గడియా నియామకంతో మొత్తం ఐదు జాయింట్ డైరెక్టర్ పదవులు భర్తీ కాగా, మూడు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎనిమిది డైరెక్టర్ స్థాయి పదవులలో కేవలం మూడు మాత్రమే భర్తీ అయ్యాయి. సందీప్ కుమార్ మిశ్రా డిసెంబర్ 2024లో నియమితులయ్యారు, కాగా పవన్ కుమార్ శర్మ , విజయకుమార్ వినాయక్ రావు పాటిల్ మార్చి 2025లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఏ ఉన్నత పరిపాలనా నిర్మాణంలో 50 శాతం పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు భావిస్తున్నారు, ప్రత్యేకించి ఈ సంస్థ నీట్, జేఈఈ దేశంలోని అత్యంత ముఖ్యమైన పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నందున ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.

కాంట్రాక్ట్ ఉద్యోగులే బలహీనత
రాధాకృష్ణన్ కమిటీ తన నివేదికలో కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధికంగా ఆధారపడటాన్ని ఏజెన్సీ యొక్క ప్రధాన బలహీనతగా గుర్తించింది . ఇది పరీక్షా విధానంలో అవకతవకలకు ఆస్కారం పెంచుతుందని హెచ్చరించింది. ఏజెన్సీ పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇటీవలి నియామకాలు ఒక అవసరమైన చర్యగా పరిగణించబ డుతున్నప్పటికీ, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో జరుగుతున్న జాప్యంతో కేంద్ర ప్రభుత్వం ,ఎన్టీఏ రెండింటికీ తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎనిమిది ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

కేంద్రం నిర్లక్ష్యం
కేంద్రప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించి పార్లమెంట్ లో చాలా సంవత్సరాలుగా ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. పరీక్ష‍ల నిర్వహణ సకాలంలో సక్రమంగా జరగట్లేదు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉంటుండగా, మరోవైపు సిబ్బందిని ఉద్యోగ విరమణలు చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. తమకు అనుకూలమైన కీలకమైన స్థానాల్లో పోస్టుల్ని తమవారితో భర్తీ చేసేసి, కింది స్థాయి పోస్టులను కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు చేయటానికి మాత్రమే చర్యలు తీసుకుంటోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి బాధ్యత లేని నిర్ణయాలవల్లే తాము నష్టపోతున్నామని పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీట్-జేఈఈ పరీక్షల
సన్నద్ధతపై కేంద్ర విద్యాశాఖ వ్యవహారశైలి మీద పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడేలా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా, మరోసారి పరీక్షలు నిర్వహించటానికి మోడీ సర్కార్ శ్రద్ధ చూపుతుందే తప్ప, విద్యాశాఖలో ఉన్న లోపాల సవరణపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆవేదన, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా వాటిని పట్టించు కుంటున్న దాఖలాలు లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -