Monday, May 18, 2026
E-PAPER
Homeఆటలుప్లే ఆఫ్స్‌‌కు ఆర్‌‌సీబీ

ప్లే ఆఫ్స్‌‌కు ఆర్‌‌సీబీ

- Advertisement -

23 పరుగులతో పంజాబ్‌‌పై గెలుపు
పంజాబ్‌‌ కింగ్స్‌‌కు తప్పని ఆరో ఓటమి
రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి
బెంగళూరు 222/4, పంజాబ్‌ 199/8

రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు టాప్‌ ‌లేపింది. పంజాబ్ కింగ్స్‌‌పై 23 పరుగులతో అదిరే విజయం నమోదు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్‌‌లోకి ప్రవేశించింది. లీగ్‌ ‌దశలో తొమ్మిదో విజయం ఖాతాలో వేసుకున్న పటీదార్‌ ‌సేన.. క్వాలిఫయర్‌-1లో చోటు దాదాపుగా ఖాయం చేసుకుంది. వెంకటేశ్‌ అయ్యర్‌ (73 ‌నాటౌట్), విరాట్‌ ‌కోహ్లి (58) అర్థ సెంచరీలతో రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు తొలుత 222/4తో భారీ స్కోరు చేసింది. ఆర్‌‌సీబీ బౌలర్లు సమిష్టిగా రాణించటంతో పంజాబ్‌ ‌కింగ్స్‌ 199/8 పరుగులకే పరిమితమైంది. వరుసగా ఆరో ఓటమితో పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపు ఆవిరి చేసుకుంది!.

​నవతెలంగాణ-ధర్మశాల
రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు ప్లే ఆఫ్స్‌‌లోకి అడుగుపెట్టింది. 13 మ్యాచుల్లో 9 విజయాలు నమోదు చేసిన బెంగళూరు ‘రాయల్‌’గా టాప్‌-4‌లో నిలిచింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌‌లో పంజాబ్‌ ‌కింగ్స్‌‌పై 23 పరుగుల తేడాతో రాయల్‌ ‌చాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. 223 పరుగుల ఛేదనలో పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌చతికిల పడింది. ప్రియాన్షు ఆర్య (0), ప్రభుస్రిమన్‌ ‌సింగ్‌ (2), శ్రేయష్ అయ్యర్‌ (1) ‌చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌‌లో దారుణంగా విఫలం అయ్యారు. శశాంక్‌ ‌సింగ్‌ (56, 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌‌లు), మార్కస్‌ ‌స్టోయినిస్‌ (37, 25 బంతుల్లో 5 ఫోర్లు) ఆఖర్లో ఆశలు రేపినా.. డెత్‌ ఓవర్లలో రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బౌలర్లు ఆ ఆశలను ఆవిరి చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు పంజాబ్‌ ‌కింగ్స్‌ 199 ‌పరుగులే చేసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్ చాలెంజర్స్‌ ‌బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (73 ‌నాటౌట్‌, 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌‌లు), విరాట్‌ ‌కోహ్లి (58, 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. మెరుపు ఇన్నింగ్స్‌‌తో చెలరేగిన వెంకటేశ్‌ అయ్యర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌’గా నిలిచాడు.

​పంజాబ్‌ ‌చతికిల
పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌లక్ష్యం 223 పరుగులు. టీ20 ఫార్మాట్‌‌లోనే అత్యధిక టార్గెట్‌ ఊదేసిన పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌ప్లే ఆఫ్స్‌ ‌రేసులో కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌‌లో అంచనాలను అందుకోలేదు. స్వింగ్‌‌స్టర్‌ ‌భువనేశ్వర్‌‌ కుమార్‌ ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య (0), ప్రభుసిమ్రన్‌ ‌సింగ్‌ (2)లను అవుట్‌ ‌చేసి పంజాబ్‌ ‌కింగ్స్‌‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (1)‌ను అవుట్‌ ‌చేసి రసిఖ సలాం బెంగళూరును ముందంజలో నిలిపాడు. 19/3తో పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌పవర్‌‌ప్లే ముగియకుండానే ఓటమి బాటలో నడిచింది. ఈ దశలో కూపర్‌ ‌కానొలి (37, 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) పవర్‌‌ప్లేలో పంజాబ్‌‌ కింగ్స్‌‌ను నిలబెట్టాడు. సూర్యాన్షు షెడ్జె (35, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే పనిలో ఉండగా.. ఈ జోడీని షెఫర్డ్‌ ‌విడదీశాడు. మిడిల్‌ ఓవర్లలో పరుగుల కట్టడితో పంజాబ్‌‌ కింగ్స్‌‌ను అసాధ్యం చేసింది బెంగళూరు. కానీ ఆఖర్లో మార్కస్‌ ‌స్టోయినిస్‌ (37), శశాంక్‌ ‌సింగ్‌ (56)లు ఎదురుదాడి చేశారు. ఈ ఇద్దరూ క్రీజులో ఉండగా పంజాబ్‌ ‌కింగ్స్‌‌ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ బ్రేక్‌ ‌తర్వాత స్టోయినిస్‌ ‌వికెట్‌‌తో పంజాబ్‌ ‌కింగ్స్‌ ఆశలపై హాజిల్‌‌వుడ్‌ ‌నీళ్లు చల్లాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు పంజాబ్‌‌ కింగ్స్‌ 199 ‌పరుగులే చేసింది. 23 పరుగుల తేడాతో రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు ఘన విజయం సాధించింది. ఆర్‌‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ ‌కుమార్‌ (2/38), రసిఖ్‌ ‌సలాం (3/36), జోశ్‌ ‌హాజిల్‌‌వుడ్‌ (1/36), రొమారియో షెఫర్డ్‌ (1/8) రాణించారు.

వెంకటేశ్‌, విరాట్‌ ‌మెరుపుల్‌ :
ధర్మశాలలో తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు ఆరంభంలోనే ఓపెనర్‌ ‌జాకబ్‌ ‌బెతెల్‌ (11) ‌వికెట్‌ ‌కోల్పోయినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విరాట్‌ ‌కోహ్లి (58) మరో అర్థ సెంచరీతో కదం తొక్కగా.. దేవదత్‌ ‌పడిక్కల్ (45) ఫటాఫట్ ఇన్నింగ్స్‌ ‌నమోదు చేశాడు. తొలి బంతినే సిక్సర్‌ ‌బాదిన పడిక్కల్‌.. కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 31 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్‌‌కోహ్లిని చాహల్‌ ‌సాగనంపాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (73 ‌నాటౌట్) ఆరంభంలో పరుగుల వేటలో ఇబ్బంది పడ్డాడు. కానీ క్రీజులో నిలదొక్కుకున్న అయ్యర్‌.. 4 సిక్స్‌‌లు, ఎనిమిది బౌండరీలు బాదాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. టిమ్‌ ‌డెవడ్‌ (28, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) సైతం రెచ్చిపోవటంతో రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్‌ ‌కింగ్స్‌ ‌బౌలర్లలో హర్‌‌ప్రీత్‌ ‌బరార్‌ (2/35) రెండు వికెట్లతో రాణించాడు.

​సంక్ష‍ిప్త స్కోరు వివరాలు :
రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు : 222/4 (వెంకటేశ్‌ అయ్యర్‌ 73, విరాట్‌ ‌కోహ్లి 58, దేవదత్‌ ‌పడిక్కల్‌ 45, హర్‌‌ప్రీత్‌ ‌బరార్‌ 2/35)
పంజాబ్‌ ‌కింగ్స్‌ : 199/8 (శశాంక్‌ ‌సింగ్‌ 56, కూపర్‌ 37, మార్కస్‌ ‌స్టోయినిస్‌ 37, రసిఖ్‌ ‌సలాం 3/36, భువనేశ్వర్‌ ‌కుమార్‌ 2/38)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -