Tuesday, July 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపాలన గాడి తప్పు‌తోందా?

పాలన గాడి తప్పు‌తోందా?

- Advertisement -

తెలంగాణాలో పదేండ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సగం కాలం పూర్తయినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పైగా ఒక్కొక్క మంత్రి రెండు మూడు ప్రధాన విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అన్నింటిపై సమీక్ష‍, నిఘా లేకపోవటం వల్ల పాలన పట్టు తప్పుతుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోది. ఎందుకంటే, దానికి కొన్ని ఉదాహరణలూ లేకపోలేదు. ఈ నెల పదిన అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరు హత్యలను చూసి తెలంగాణ ప్రజానీకం దిగ్బ్రాంతికి ‌గురైంది. ‌నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ షాబా‌ద్‌లో నివాసం ఉంటూ పక్కింటి మైనర్ బాలికను వేధించటం వల్ల అతనిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆశ్చర్యకర విషయమేమంటే ఈ కేసులో సాధారణంగా బెయిల్ దొరకటం కష్టం. కానీ రాజ్‌కుమార్ విషయంలో యాంటిసిపేటరీ బెయిల్ దొరికిందంటే షాబాద్ పోలీసుల నిర్లక్ష్యం, అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమ్మాయిని వేధిస్తుంటే బాధిత కుటుంబసభ్యులు అనేకమార్లు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినా, లంచాలకు మరిగిన పోలీసులు నిర్లక్ష్యం వహించారు. పైగా పోక్సో కేసులో కూడా బెయిలెబుల్‌ సెక్షన్లు పెట్టడంతో రాజకుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. బాలిక కుటుంబపై కక్ష‍ పెంచుకుని బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తన భార్యతో పాటు ఇద్దరు కొడుకులనూ నిర్దాక్ష‍ిణ్యంగా చంపేసి అద్దె కారులో పరా య్యాడు. ముఖ్యమంత్రిగా హోం శాఖను కూడా తన ఆదీనంలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆ బాధిత కుటుంబానికి, శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రజానీకానికి ఏమి సమాధానం చెబుతాడు? పోలీస్ వ్యవస్థనే కాదు, ఆ మాటకొస్తే అన్ని శాఖలు దాదాపు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయాయి. ముఖ్యంగా రెవెన్యూ, సబ్‌‌రిజిస్ర్టేషన్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఇలా అనేక శాఖల్లో లంచాలు తీసుకుంటూ చాలామంది అధికారులు ఏసీబీకి పట్టుపడుతున్నారు. వ్యవస్థలు ఇంతగా కుళ్లి పోవటానికి ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిది బాధ్యత అయితే, దాన్ని అరికట్టలేని ప్రస్తుత సర్కార్‌‌ది కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది.

అలాగే ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి హైదరాబాద్‌లోనే ఉండి మంత్రివర్గ సమా వేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. దీనికి కారణం వెతికితే ఆమె ముఖ్యమంత్రిపై అలక పూని నట్టుగా చెప్పుకొంటున్నారు. ఇటీవల యాదగిరి గుట్ట దేవస్థాన ధర్మకర్త మండలి కమిటీ నియామకమైంది. ఆమెను సంప్ర దించకుండానే చైర్‌‌పర్సన్‌, సభ్యులను నియమించారని, అందుకే మంత్రివర్గ సమావేశానికి రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో విషయం, ఇటీవల ముఖ్యమంత్రి టూరిజం శాఖపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష‍లో సంబంధిత శాఖ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు లేరు. ఆ సమయంలో ఆయన కొల్లాపూర్‌‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఈతకొడుతూ సేదతీరుతున్న వీడియోను వైరల్‌ అయింది. సీఎంతో రివ్యూ ఉందంటే సంబంధిత మంత్రి స్వయంగా మాట్లాడి డేట్ తీసుకోని ఉండాలి. లేదా సీఎంఓ నుంచి ఓఎస్‌డిని గానీ, మంత్రినిగానీ సంప్రదిదంచి సమావేశ తేదీ నిర్ణయించటం పరిపాటి. స్వయంగా సీఎం ఒక శాఖను రివ్యూ చేస్తుంటే సంబంధిత మంత్రి హాజరు కాకపోవటం, పైగా తాను ఈతకొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ధిక్కార స్వరం అనటంలో సందేహం లేదు! ఏ వృత్తిలోనైనా క్రమశిక్షణ ముఖ్యం. మరి రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే చాలామందిపై వారు చేసే పనుల ప్రభావం పడుతుంది. కానీ రాష్ట్రంలోని కొందరు మంత్రుల ప్రవర్తన, సీనియర్ల అలక, సీఎంకు పరిపాలనలో అనుభవం లేకపోవటం ఇలాంటి వాటికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే సమయం మించిపోయింది. పరిపాలనలో పట్టుకోల్పోతే పుట్టి మునగటం కాయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అన్ని శాఖల మంత్రులతో సమీక్ష‍లు నిర్వహించి పాలనను పటిష్టపరచాలి. లేదంటే ప్రజల్లో ఉన్న కాస్త విశ్వాసం కూడా పోతుంది.
కొండి సుధాకర్ రెడ్డి,
8985037713

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -