భారతదేశంలో విద్య అనేది కేవలం పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నిర్వహణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది దేశ ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, శాస్త్ర సాంకేతిక ప్రగతి, ప్రజాస్వామ్య బలోపేతానికి పునాది. అందుకే భారత రాజ్యాంగం విద్యను కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగల ఉమ్మడి జాబితాలో చేర్చింది. దీని ఉద్దేశం దేశవ్యాప్తంగా నాణ్యతను కాపాడుతూనే, స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు తమ విద్యా విధానాలను రూపొందించుకునే అవకాశాన్ని కల్పించడం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ -2025 (విబిఎస్‌ఎ) బిల్లు ఈ సమతుల్యతను మార్చబోతుందా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉన్నత విద్యలో సమూల సంస్కరణగా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) , నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) వంటి సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, దేశవ్యాప్తంగా ఒకే నాణ్యతా ప్రమాణాలు అమలు చేయాలనేది ప్రభుత్వ వాదన. అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, నియంత్రణలో పారదర్శకత తీసుకు రావడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత ఉన్నత విద్యను తీర్చిదిద్దడం ఈ బిల్లుకు ప్రధాన లక్ష్యాలని కేంద్రం చెబుతోంది.అయితే, ఈ బిల్లుపై వస్తున్న అభ్యంతరాలు కేవలం రాజకీయాలకే పరిమితం కావడం లేదు. ఆశ్చర్యకరంగా, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు కూడా ఇందులోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీని అర్థం ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య పోరాటం కాదని, కేంద్ర–రాష్ట్ర అధికారాల సమతుల్యతకు సంబంధించినదని చెప్పవచ్చు.
రాష్ట్రాల ప్రధాన ఆందోళన ఏమిటంటే, ఈ బిల్లు ద్వారా ఉన్నత విద్యపై ఉన్న కీలక అధికారాలు క్రమంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ విశ్వవిద్యాలయాల స్థాపన, విస్తరణ, కొత్త కోర్సులు, స్థానిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలు రూపొందించే విషయంలో కీలక పాత్ర పోషించాయి. కొత్త వ్యవస్థలో నియంత్రణ, అక్రిడిటేషన్, నాణ్యతా ప్రమాణాలు, డిగ్రీల గుర్తింపు వంటి అంశాల్లో కేంద్ర సంస్థకే తుది అధికారం లభిస్తే, రాష్ట్రాల పాత్ర గణనీయంగా తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు. భారతదేశం ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే సామాజిక పరిస్థితులు కలిగిన దేశం కాదు. తెలంగాణలో అవసరమైన విద్యా విధానం, నాగాలాండ్‌లో అవసరమైనది ఒకటిగా ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, సముద్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమైన కోర్సులు ఉండవచ్చు. కర్నాటకలో సాంకేతిక రంగం అవసరాలు ఎక్కువగా ఉండవచ్చు. ఈ భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యా విధానాలను రూపొందించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకే కేంద్ర ప్రమాణాన్ని దేశమంతటికీ వర్తింపజేయడం వల్ల ప్రాంతీయ అవసరాలు నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ మరో కీలక అంశం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో కాకుండా అకాడమిక్ స్వేచ్ఛతో అభివృద్ధి చెందాయి. పరిశోధన, కొత్త కోర్సుల రూపకల్పన, స్థానిక అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర నిర్ణయాధికారం ఉండటం అభివృద్ధికి దోహదపడింది. ఈ బిల్లులో కేంద్ర నియంత్రణ అధికమైతే, ఆ స్వేచ్ఛ క్రమంగా తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వాదనలను పూర్తిగా కొట్టిపారేయలేం. భారత ఉన్నత విద్యలో నాణ్యత అసమానంగా ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తుండగా, మరికొన్ని కనీస ప్రమాణాలకు కూడా చేరుకోవడం లేదు. నకిలీ డిగ్రీలు, నాణ్యతలేని ప్రైవేట్ కళాశాలలు, అనుమతుల ప్రక్రియలో అవినీతి వంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి సమగ్ర నియంత్రణ వ్యవస్థ అవసరమనే వాదనలో బలం ఉంది. ప్రశ్న మాత్రం ఒకటే-నాణ్యతను పెంచాలంటే అధికారాలన్నీ కేంద్రీకరించడమే ఏకైక మార్గమా?
ఈ బిల్లుపై చర్చ మరో కోణాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో అధికారాలను క్రమంగా తన వద్దకు కేంద్రీకరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. జీఎస్‌టీ అమలు తర్వాత రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యంపై జరిగిన చర్చల మాదిరిగానే, ఇప్పుడు విద్యా రంగంలో కూడా సమాఖ్య స్ఫూర్తి బలహీనపడుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. విద్య వంటి సున్నితమైన రంగంలో కేంద్రం, రాష్ట్రాలు భాగస్వాములుగా పనిచేయాల్సిన సమయంలో నియంత్రణ ఒకే కేంద్ర సంస్థ చేతుల్లోకి వెళ్లడం సమాఖ్య వ్యవస్థకు అనుకూలమా కాదా అన్నది ప్రధాన చర్చగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కొనసాగాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలు రూపొందించే స్వేచ్ఛ ఉండాలని, కేంద్రం నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించినా అమలులో రాష్ట్రాలకు నిర్ణయాత్మక పాత్ర కల్పించాలని ఆ రాష్ట్రం సూచించింది. ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఏకపక్షంగా అమలు చేయడం కంటే రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించడం అవసరం. జాతీయ ప్రమాణాలు అవసరమే. కానీ వాటిని రూపొందించే ప్రక్రియలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలి. కొత్త నియంత్రణ సంస్థ పాలక మండలిలో రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి చట్టపరమైన హామీలు కల్పించాలి. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాష్ట్రాల వద్దే ఉంచాలి.
‘‘వికసిత్ భారత్’’ అనే లక్ష్యం కేవలం బలమైన కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం కాదు. బలమైన రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనిచేసే విద్యా వ్యవస్థ, దేశవ్యాప్తంగా ఒకే నాణ్యతా ప్రమాణాలు-ఈ నాలుగు కలిసి పనిచేసినప్పుడే నిజమైన విద్యా సంస్కరణ సాధ్యమవుతుంది. విద్యలో నాణ్యతను పెంచడం ఎంత అవసరమో, భారత సమాఖ్య వ్యవస్థను కాపాడటం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించగలిగితేనే వికసిత్ భారత్ లక్ష్యం సార్థకమవుతుంది.
సిహెచ్.వి. ప్రభాకర్ రావు, 9391533339
విద్యా సంస్కరణల పేరుతో రాష్ర్ట అధికారాల కేంద్రీకరణా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



