47 మంది మృతి..
మరో 97 మందికి గాయాలు
బీరుట్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్‌పై దాడులకు తెగబడింది. లెబనాన్‌లోని 80కి పైగా హెజ్బుల్లా లక్ష్యాలపై, పౌర ఆవాసాలపై విమాన దాడులు చేసింది. ఇజ్రాయిల్ దాడుల్లో కనీసం 47 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. మరో 97 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరులో లెఫ్టినెంట్ కల్నల్ సహా నలుగురు ఇజ్రాయిల్ సైనికులు మరణించారు. లెబనాన్ మొత్తాన్ని తగలబెట్టండి అని ఆదేశాలిచ్చానంటూ ఇజ్రాయిల్ జాతీయ భద్రతా శాఖా మంత్రి ఇజామర్ బెన్ గ్వీర్ శుక్రవారం నిస్సిగ్గుగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శాశ్వత యుద్ధం’ తప్ప ఇజ్రాయిల్‌కు వేరే ఆసక్తి లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. తమ సైనికులపై దాడులను సహించేది లేదని, అవసరమైనంత కాలం లెబనాన్‌లోనే తమ సైన్యం ఉంటుందని స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్‌లోని ప్రాంతాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆక్రమణ కొనసాగు తుందంటూ చెప్పుకొచ్చారు.



