Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు

తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు

- Advertisement -

గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన
రహదారుల అనుసంధానం : కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి
సీఆర్‌ఎఫ్‌ ‌రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు


నవతెలంగాణ-కందుకూరు

దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణకు మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించినట్టు, వాటికి ఐదు లక్షల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం లేమూరు, బేగంపేట, తిమ్మాపురం గ్రామాలకుగాను రూ.87 కోట్ల సీఆర్ఎఫ్ ఫండ్స్‌తో శుక్రవారం రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తిమ్మాపూర్ గ్రామానికి వివిధ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు రూ.100 కోట్ల రహదారి నిర్మాణ పనులు మంజూరు చేసినట్టు తెలిపారు. కొంగర, రావిరాల, శ్రీశైలం రోడ్డు, రాచులూరు, అగర్ మియగూడ జబార్‌గూడ, ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడెం, చర్లపటేల్‌గూడెం, ఇబ్రహీంపట్నం రోడ్డు, గుమ్మడవెల్లి, మీర్‌ఖాన్‌పేట, కుర్మిద్ద తదితర ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మాదాపూర్, బేగంపేట్ ప్రాంతాలతో కూడా కనెక్టివిటీ పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు
హైదరాబాద్–పూణే, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నయ్‌ మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటుకు ప్రాథమిక అంచనా వ్యయం సుమారు రూ.5 లక్షల కోట్లు కాగా, భూసేకరణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది రూ.10 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంద‌ని తెలిపారు. ప్రస్తుతం హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్లకు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే డీపీఆర్ పూర్తైన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఈ మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల మరో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచనలు జరుగుతున్నాయని, ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషితో ఈ ప్రాంతానికి కేంద్ర నిధుల ద్వారా రూ.100 కోట్ల రహదారి పనులు మంజూరైనట్టు తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందకపోవడం వల్ల కొన్ని రహదారి పనులు ఆలస్యమైన విషయం వాస్తవమేనని అంగీకరించిన మంత్రి, ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ చైర్మెన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, మాజీ ‌జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్‌ కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -