పార్లమెంట్‌కు నీట్‌ సెగ

నిగ్గు తేల్చాల్సిందే– అంగీకరించని మోడీ సర్కార్‌
– చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు
– ఉభయ సభల్లో వాయిదాల పర్వం
– సభలో మాట్లాడుతుండగా రాహుల్‌ మైక్‌ కట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా ఫోరం సభ్యులు డిమాండ్‌ చేయడంతో శుక్రవారం ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే తీరు కనిపించింది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ చర్చను లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు సభలో నీట్‌ అంశాన్ని లేవనెత్తాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్‌ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్‌ పరీక్షలపై సభలో చర్చించాలని ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇరు వైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల వైపు నుంచి నీట్‌ పరీక్షపై విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్‌ అన్నారు. నీట్‌పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరని తెలిపారు. కానీ ప్రతిపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టువీడలేదు. నీట్‌పై చర్చ చేపట్టాల్సిందే అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్‌ వాయిదా వేశారు. ఆ తరువాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు.
రాజ్యసభలోనూ..
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నీట్‌ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. పేపర్‌ లీకేజీపై ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. అయినప్పటికీ చైర్మెన్‌ ధన్‌ఖర్‌ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. కాగా, నీట్‌ వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ తప్పుబట్టారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీతో లక్షలాది మంది విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్ష ఇండియా ఫోరం సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారని, ఇక తాను క్రిమినల్‌ చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ నోటీస్‌ ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. అయితే వీటిపై చర్చ జరగకపోవడం విచారకరమని అన్నారు. ఇక దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీతో యువత భవిష్యత్‌ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ సింగ్‌ హుడా ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానాలో అత్యధికంగా పేపర్‌ లీక్‌ కేసులు వెలుగు చూశాయని చెప్పారు.నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యతల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాము ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు లేవనెత్తితే మైక్‌ను స్విచ్చాఫ్‌ చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత మైక్‌ను నిలిపివేయడంతో ప్రతిపక్ష ఎంపీలు అసంతృప్తికి లోనై ప్రభుత్వ తీరును తప్పుపట్టారని చెప్పారు. కీలకమైన నీట్‌ అంశంపై సభలో చర్చ జరగాలని తాము పట్టుబట్టామని ఆయన పేర్కొన్నారు.
నిగ్గు తేల్చాల్సిందేచర్చ జరగాల్సిందే : రాహుల్‌ గాంధీ డిమాండ్‌

నీట్‌ పరీక్ష నిర్వహణలో అవకతవకల అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఈ అంశంపై లోతైన చర్చ జరగాలని అన్నారు. ”యువత ఆందోళన చెందుతోంది. వారికి ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థుల ఆందోళనలను తగ్గించడానికి పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు చర్చించాలి. వారిలో భయాందోళనలు తొలగించాలి. ఇది యువతకు సంబంధించిన సమస్య కాబట్టి, ఈ సమస్యపై లోక్‌సభలో గౌరవప్రదమైన చర్చ జరగాలని నేను ప్రధానిని కోరుతున్నాను. నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్చ జరగాలని ఇప్పటికే ప్రతిపక్ష నేతలందరూ అంగీకరించారు. దేశ భవిష్యత్తు యువతది. వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి” అని రాహుల్‌ గాంధీ కోరారు. ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు.
ప్రతిపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని, తాము సభ్యులకు మరోసారి హామీ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పదేపదే చెప్పినా సభా కార్యకలాపాలకు కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడుతూ సభను సజావుగా జరగనివ్వకపోవడం సరైంది కాదని, దీన్ని తాను ఖండిస్తున్నానని కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలవద్దని ఆయా సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

Spread the love