బీఆర్‌ఎస్‌ను ఖతం చేయటం ఎవరితరం కాదు

It is nobody's business to destroy BRS– కాంగ్రెస్‌ గ్రాఫ్‌ దిగజారుతోంది : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
– గెలుపోటములతో సంబంధం లేకుండా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం
– తెలంగాణ భవన్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వంపైనా ఇంత త్వరగా వ్యతిరేకత రాలేదని ఆయన గుర్తు చేశారు. అది ఉంటుందా..? ఊడుతుందా..? అనేది తెలియటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. అంతకుముందు అక్కడి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలేసి, అమరవీరులకు నివాళులర్పించారు. 1969 తొలి దశ, ఆ తర్వాత మలి దశ ఉద్యమ జ్ఞాపకాలను, ఆనాటి ఉద్యమకారులతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైనా, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం ప్రసంగిస్తూ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎంతో కఠోరమైన దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పాలనలో కోతల్లేకుండా 24 గంటలపాటు కరెంటును అందిస్తే… ఇప్పుడు పవర్‌ కట్‌లు షురూ అయ్యాయని వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అలవిగాని హామీలనిచ్చి ప్రజలను మోసపుచ్చిందని విమర్శించారు. రైతు బంధు, ఆసరా పింఛన్లు, ధాన్యానికి మద్దతు ధర, వరికి బోనస్‌, సాగు, తాగునీటి గోసలను ఏకరువు పెట్టారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు మళ్లీ క్యూలైన్లలో నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలపై దృష్టి సారించకుండా సీఎం, మంత్రులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
తమ పార్టీని ఖతం చేస్తామంటూ కొందరు ఇష్టానుసారంగా మాట్లాడున్నారని కేసీఆర్‌ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలోంచి పుట్టిన బీఆర్‌ఎస్‌ను ఖతం చేయటం ఎవరి తరమూ కాదని హెచ్చరించారు,. ‘మోకాలు ఎత్తు లేని వారు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు…’ అంటూ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ అనేది ఒక మహావృక్షం, ఒక మహా సముద్రమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందనీ, తాను మళ్లీ బస్సు యాత్ర మొదలుపెట్టగానే తెలంగాణ గర్జించిందని అన్నారు. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది, అయితే త్వరలోనే పుంజుకుని బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఆ తర్వాత ఓడిపోయింది, మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపోటములనేవి తాత్కాలికమేననీ, ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకం కావాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం హరీశ్‌రావా..? రేవంతా…?
మాజీ మంత్రి హరీశ్‌రావు వల్లే రాష్ట్రంలో కరెంటు కోతలు కొనసాగుతున్నాయంటూ సీఎం రేవంత్‌ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్‌ విమర్శించారు. ఈ రాష్ట్రానికి సీఎం ఎవరు..? రేవంతా..? హరీశా..? అని ప్రశ్నించారు. రేవంత్‌ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా లేవని ఆక్షేపించారు. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వానికి ‘స్టెప్‌ డౌన్‌ స్టార్ట్‌’ అయ్యిందని ఎద్దేవా చేశారు. అందుకే అది అప్రదిష్ట పాలవుతోందని వ్యాఖ్యానించారు.
పొంగిపోయేది లేదు.. కుంగిపోయేది లేదు…
లోక్‌సభ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడుతూ… తమ పార్టీకి 11 స్థానాలు వస్తాయంటూ ఒక సంస్థ చెబితే, ఒక్కటే సీటు వస్తుందంటూ మరో సంస్థ చెప్పిందని గుర్తు చేశారు. ఈ సర్వేలన్నీ పెద్ద గ్యాంబ్లింగ్‌ అంటూ కొట్టిపారేశారు. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రజా క్షేత్రంలో పని చేస్తూ పోవటమే తమ లక్ష్యమన్నారు. ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు, తక్కువ సీట్లు వస్తే కుంగిపోయేది లేదన్నారు. పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామనీ, నల్లగొండ పట్టభద్రుల ఎలక్షన్‌లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలతో ఆగం కావొద్దనీ, సమీప భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌దే అధికారమని చెప్పారు. మొక్కవోని దీక్షతో పని చేయాలని క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు.
ప్రజల గుండెల్లో మా లోగో…
లోగో అనేది ప్రజల గుండెల్లో ఉంటుందని కేసీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందువల్ల అలాంటి అంశాల జోలికి పోకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా త్వరలోనే నూతన ఉద్యమ పంధాను, కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రోజులపాటు నిర్వహిస్తామని కేసీఆర్‌ వివరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతోపాటు సీనియర్‌ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love