– నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు
నవతెలంగాణ – కంటేశ్వర్
రాజారాం యాదవ్ యాదవ, కురుమలతో బలవంతంగా రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలను చేయించడం సరైనది కాదు అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు మండిపడ్డారు.నిన్నటి రోజు అనగా బుధవారం రాజారామ్ యాదవ్ యాదవ, కురుమలతో బలవంతంగా రేవంత్ రెడ్డి వాక్యాలకు నిరసనగా చేయించిన ధర్నాకు కౌంటర్ గా కేశ వేణు గురువారం కాంగ్రెస్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. ఇది కేవలం రాజారామ్ యాదవ్ వ్యక్తిగతంగా చేసిందని,యాదవ,కురుమ సోదరులను భయభ్రాంతులకు గురిచేసి ఒకవేళ నిరసనకు రాకుంటే జరిమానా విధిస్తామనే ధోరణితో బెదిరించారని దీనిని జిల్లా కురుమ సంఘం అధ్యక్షునిగా, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కేశ వేణు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మాత్రమే అన్నారని ,యాదవులు, కురుమలను కించపరిచే విధంగా ఎలాంటి వాక్యాలు చేయలేదని, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని, యాదవులు,కురుమ సోదరులు రాజారం లాంటి వ్యక్తుల మాటలకు భయపడవద్దని ఆయన అన్నారు. కేసీఆర్ ,కేటీఆర్ రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా అక్కడ ఉన్న గొల్ల కురుమలకు మాత్రమే రెండవ విడత గొర్రెలు పంపిణీ చేస్తున్నాడని, రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టిన వారికి ఎందుకు గొర్రెలు పంపిణీ చేయడం లేదు అని ఏ రోజు అయినా రాజారాం యాదవ్ కేసీఆర్ కేటీఆర్ లకు వినతిపత్రం ఇచ్చార అని ప్రశ్నించారు.మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గొల్ల కురుమల సోదరుల ఖాతాలలో డబ్బులు వేసి ఎన్నికలు ముగియగానే ఖాతాలను కెసిఆర్ బ్లాక్ చేయించడం జరిగిందని,మునుగోడులో గొల్ల కురుమలను టిఆర్ఎస్ మోసం చేస్తుంటే ఎందుకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ అన్న మాటలకు కౌంటర్ గా కేవలం శ్రీనివాస్ యాదవ్ ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని వాక్యానించారని ,అది ఏ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేరని, వ్యవసాయం చేసే ప్రతి ఇంట్లో ఆవులు ,బర్రెలు పేడతో ఎన్నో పనులు చేస్తారని ఆ విధంగా చూస్తే అన్ని కులాల వారు రేవంత్ రెడ్డి గారి పై తిరగబడాలని కానీ రేవంత్ రెడ్డి వాక్యాలలో తప్పు లేదని గ్రహించిన మిగతా కులాల వారు ఈ విధంగా నిరసనలు చేయడం లేదని, కేవలం రాజారాం లాంటి కొందరు వ్యక్తులు తమ స్వార్ధ రాజకీయాల కొరకే రేవంత్ రెడ్డి పై గొల్ల కురుమలతో నిరసనలు చేయిస్తున్నారని ,కావున గొల్ల కురుమ యాదవ సోదరులు ఇలాంటి వారి మాటలు నమ్మకుండా గొర్రెలు పంపిణీ చేస్తానని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పై నిరసనకు సిద్ధం కావాలని, తమ హక్కులు కాపాడుకునే విధంగా గొల్ల కురుమలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. నిన్నటి రోజు యాదవులు, కురుమలు చేసిన ధర్నాకు వెళ్లాలంటే తమ కూలీ పోతుందని ,డబ్బులు రావని మరోపక్క రాకుంటే జరిమానా విధిస్తామని కొందరు బెదిరిస్తున్నారని గొల్ల కురుమ సోదరులు నాకు ఆ సమాచారం ఇచ్చారని నిన్నటి రోజు చేసిన ధర్నా అధికారికంగా గొల్ల కురుమలు చేసింది కాదు కావున వెళ్లే అవసరం లేదని కూలీ చేసుకునే గొల్ల కురుమలకు చెప్పడం జరిగిందని, రాజారామ్ యాదవ్ ఇచ్చిన గాంధీభవన్ ముట్టడి కార్యక్రమానికి ఎవరు వెళ్లే అవసరం లేదని నిజామాబాద్ జిల్లా కురుమ అధ్యక్షుడిగా చెప్తున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్ ,కురుమ కేశ మహేష్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రవీందర్, కురుమ సాయిబాబా ,విపుల్ గౌడ్, ప్రీతం ,అష్రఫ్ ,సాయి ,ప్రసాద్, నిఖిల్ ,వినోద్ మరియు తదితరులు పాల్గొన్నారు.