నవతెలంగాణ-ఓయూ
మనుధర్మాన్ని యధాతధంగా ఆధునిక సమాజంలోనూ అమలు చేస్తూ ప్రాచీన కాలం నాటి రాజదండం రాజ్యాంగానికి ప్రత్యామ్నా యంగా బ్రాహ్మణ హైందవ సాంప్రదాయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేయడం సిగ్గుచేటని దక్షిణ భారత సమితి కన్వీనర్ ప్రొ. గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోధ్య లోని రామ మందిరం పునాది ప్రారంభం కూడా దళితులైన ఆనాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చే ప్రారంభింప చేయలేదని.. ఇప్పుడు పార్లమెంట్ భవనాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేయలేదని అన్నారు. భారత ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా సమస్యల చర్చకు వేదికైనా ప్రజాస్వామ్య దేవాల యాన్ని హైందవ బ్రాహ్మణుల మనుధర్మాన్ని పాటిస్తున్న పూజార్ల ఆశీస్సులతో రాజదండాన్ని నూతన పార్లమెంట్ భవనంలో ఆవిష్కరించడం అంటే సనాతన మన ధర్మాన్ని అమలు చేయడమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది రాజదండం కాదన్నారు. రాజ్యాంగ వ్యతిరేకి అయిన బీజేపీని రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామిక విలువల్ని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత బహుజనలపై ఉందని ప్రొ. గాలి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.