పిల్లలకు వైషమ్యాలు ఎక్కించటం దేశభక్తా..?

– ఐక్యతకు విఘాతం కలిగిస్తే అభివృద్ధి ఎలా సాధిస్తాం?
– సమాజ ఐక్యత, దేశభవిష్యత్‌ కోసం పోరాడాలి
– ఏఐఐఈఏ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి కె . వేణుగోపాల్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజలంతా ఐక్యంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, బ్రిటీషోడిని తరిమికొట్టి స్వాతంత్రాన్ని సాధిస్తే..ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి దేశభక్తిని రగిలిస్తున్నట్టు ఉపన్యాసాలు ఇవ్వటం విడ్డూరంగా ఉందని 10టీవీ మాజీ ఎమ్‌డీ, ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంపాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ కార్యాలయం (ఎంహెచ్‌ భవన్‌) ముందు పత్రిక ఫీచర్స్‌ ఎడిటర్‌ కె ఆనందాచారి జాతీయ జెండాను ఎగరేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీజీఎం ప్రభాకర్‌, ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌, జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15కు ముందు బ్రిటీషు వాళ్ల నుంచి విముక్తి కోసం ప్రజలంతా ఐక్యమత్యతతో పోరాడారని గుర్తు చేశారు. ఆ ఐక్యతను ఇప్పుడు కొనసాగించాల్సిన మరింత అవసరం ఉందన్నారు. అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు.’ఈ దేశం నాది.దేశంలోని ప్రజలంతా అన్నదమ్ముల వలే కలిసుంటాం’అంటూ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు, ‘సారే జ హాసే అచ్చా..హిందుస్థానీ హమారా, హమారా’ అంటూ  మహ్మద్‌ ఇగ్బాల్‌ రాసిన గీతంను రోజూ విద్యార్థి స్థాయి నుంచే ద్వారా చెబుతూ గతంలో స్ఫూర్తిని నింపే వారని వివరించారు. కానీ..ప్రస్తుత ప్రభుత్వం సీబీఎస్‌ఈ సిలబస్‌ను మార్చి స్వాతంత్రోద్యమ పోరాటాన్ని మసక బార్చే విధంగా పాఠ్యాంశాలను జొప్పిస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య జరిగిన ఘర్షణలను, దేశ విభజన ఘోరాలను ఆగష్టు 14నే విద్యార్థులకు చూపించాలని నిర్ణయించటంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దేశంలో శాంతిని నెలకొల్పటమంటే..నిరుద్యోగ సమస్యను నిర్మూలించటం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటం, కార్మికుల కష్టానికి తగిన ఫలితం దక్కేలా చూడటమని వివరించారు. అందుకు తగిన విధానాలుండాలన్నారు.
ఉద్యోగ కల్పన లేకుండా..ప్రజల వెతల్ని పట్టించుకోకుండా ఐక్యత ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. రైతుల్ని, కార్మికులను ప్రశంసించి, వీరంతా విశ్వకర్మలని సరిపెట్టుకుంటే సరిపోదని హితవు పలికారు. బ్యాకుల నుంచి బడా కార్పొరేట్లు సుమారు 14.5లక్షల కోట్లు తీసుకుని ఎగ్గొట్టిన దాంట్లో సంక్షేమానికి ఖర్చు చేసేది పిసరంతేనని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామనీ, సమాజ ఐక్యతను దేశ ఐక్యతను కాపాడుకునేందుకు అందరమూ ప్రతిన బూనాలన్నారు. రాంపల్లి రమేష్‌ మాట్లాడుతూ జాతీయోద్యమ స్ఫూర్తితో దేశ ఐక్యత కోసం భావాజాల వ్యాప్తిని చేయాల్సిన అవశ్యత ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిందని గుర్తు చేశారు. సాధించిన పురోగతిని వెనక్కి నెట్టేస్తున్న తరుణమిదని తెలిపారు. వైషమ్యాలను సృష్టించి, తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు.

Spread the love