ఎస్సారెస్పీకి జలకళ.. కేసీఆర్‌తోనే సాధ్యం

– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
– ఘనంగా ‘శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ 60 వసంతాలు వేడుక’
నవతెలంగాణ-మెండోరా
ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామ్‌సాగర్‌ (ఎస్సారెస్పీ) ప్రాజెక్ట్‌ పనులకు శ్రీకారం చుట్టి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద బుధవారం నిర్వహించిన ‘శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ 60 వసంతాలు వేడుక’లకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌పై ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్‌ పంప్‌ హౌజ్‌ వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి ప్రసంగించారు. 1951లో ఆనాటి హైదరాబాద్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే.. 12 సంవత్సరాలకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1963లో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.40 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 1983లో ఎస్సారెస్పీ పూర్తి చేసి డ్యాంలో నీటిని నింపారన్నారు. ప్రాజెక్ట్‌ మొదటి ఫేజ్‌ పూర్తి కావడానికి సుమారు 20 ఏండ్లు పట్టిందని తెలిపారు. 2015-16లో పది లక్షల ఎకరాల అయకట్టుకు నీళ్లు అందించేలా రెండో ఫేజ్‌ పనులు పూర్తయ్యాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌ ఎన్నో సార్లు ఆవేదన వ్యక్తం చేశారని, ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాలుగా, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా ఉన్నాయని 1996లో ఎస్సారెస్పీ కట్ట మీద ప్రాజెక్ట్‌ దుస్థితి చూసి కేసీఆర్‌ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
ఎన్నో సార్లు ఎండిపోయిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ చూశానని, పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామని, ఎస్సారెస్పీ ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేశామని తెలిపారు. ప్యాకేజీ 21, 22 ద్వారా ఉమ్మడి జిల్లాలోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను త్వరలో అందిస్తామన్నారు. ఈ వేడుకల్లో ఉద్యమకారుడు, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్‌ శాఖ సలహాదారు శ్రీధర్‌ రావుదేశ్‌ పాండే, ఈఎన్సీ నాగేందర్‌, ఎస్సారెస్పీ సీఈ సుధాకర్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సీఈ నల్లా వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌ సీఈ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love