నిందితుల పై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యాశాఖలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో 37 మంది జూనియర్ లెక్చరర్లు ఉద్యోగాలు పొందినట్లు వెలుగులోకి రావడం అత్యంత ఆందోళనకర విషయమనీ, వారిపైనా, వారికి సహకరించిన ఇంటర్ విద్యాశాఖ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 360 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం 37 మంది సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయనీ, వారిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు వచ్చిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదనీ, వాటిని పరిశీలించకుండా ఆమోదించిన అధికారులు, మధ్యవర్తులు, ఇతర బాధ్యుల పాత్రపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాల పేర్లతో జారీ చేసిన సర్టిఫికెట్ల విషయంలో ప్రత్యేకంగా సమగ్ర వెరిఫికేషన్ చేపట్టాలనీ, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల అధ్యాపకుల విద్యార్హతలను డిజిటల్ విధానంలో మరోసారి పరిశీలించాలని కోరారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనీ, అలాంటి వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఫేక్ సర్టిఫికెట్లతో జేఎల్ పోస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



