కనీస సదుపాయాలకు నోచని పరిస్థితి
రెండేండ్ల కాలపరిమితి వల్ల ఏమీ చేయలేని వైనం
నామినేటెడ్ పద్ధతిలో
పాలక వర్గాల ఏర్పాటు
మూడేండ్లకు పొడిగించాలని
చైర్మెన్ల డిమాండ్
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు .. సమస్యలకు నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లకు పాలక మండలి సభ్యుల్ని నామినేటెడ్ పద్దతిలో నియమించారు. అయితే మార్కెట్లలో తాగునీరు, గిడ్డంగుల వంటి కనీస సౌకర్యాల్లేవు. మౌళిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు గిట్టుబాటు ధర, రవాణా సౌకర్యం, సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు వేయడం వంటి కీలక బాధ్యతల్ని పాలక కమిటీలే చూడాలి. రైతులకు సేవలు అందిస్తున్న పాలకవర్గాలను రెండేండ్లకే మార్చివేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక పనులు మొదలు పెట్టిన పాలక కమిటీలు అవి పూర్తి గాకుండానే బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మొదలు పెట్టిన పనులు అసంపూర్తిగానే ఉండిపోతున్నాయి. ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌లు రహస్యంగా సమావేశమయ్యారు. పదవి కాలాన్ని మూడేండ్లకు పెంచేలా వత్తడి తీసుకరావాలని నిర్ణయించినట్టు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా 197 వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నాయి. వీటికి ప్రతి రెండేండ్లకోసారి పాలక వర్గాలు మారుతుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు నామినేట్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మార్కెట్ మొత్తం బడ్జెట్‌లో 10 శాతం చైర్మెన్ చేతుల్లో ఉండేది. ఇప్పుడా చైర్మెన్‌లకు మార్కెట్‌కు వచ్చిన ఆదాయం నుంచి ఖర్చు చేసే అవకాశాలు లేవు. దేనికైనా ఖర్చు చేయాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి తర్వాత అనుమతులు వచ్చిన తర్వాతనే వాడుకోవాలి. దీంతో ఏ చిన్న ఖర్చు అయినా అనుమతులు తీసుకోవాల్సి రావడంతో మార్కెట్లలో సమస్యలు జటిలంగా మారుతున్నాయి. మార్కెట్టలో అంతర్గత రోడ్లు వేయట్లేదు. కొత్తగా నిర్మించిన మార్కెట్లలో అనేక సమస్యలున్నాయి. రైతులు భోజనం చేయడానికి హాలు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. నిధుల్లేక ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రతి మండలానికి ఒక మార్కెట్ ఉంటే రైతులు దాన్యం అమ్ముకోవడం సులభమవుతోంది. మార్కెట్లకు రైతులు తీసుకొస్తున్న ధాన్యం, మక్కలు, వేరుశనగ, చిరుదాన్యాలు మాత్రమే తీసుకొస్తున్నారు. దీన్ని బహుళార్థక మార్కెట్‌గా మార్చి పశువుల సంత, కూరగాయలు, చేపలు, మాంసం తధితర అమ్మకాలను వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి తీసుకరావాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌లో రూ. 12 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. డ్రైనేజీ కోసం రూ. 4 కోట్లు, షెడ్డుకోసం రూ. 3 కోట్లు, తెలకపల్లిలో 2.50 కోట్లు సీసీ రోడ్ల కోసం రూ. 50 లక్షలు, నాగర్‌కర్నూల్ కార్యాలయం కోసం రూ. 40 లక్షలు, సీసీ రోడ్ల కోసం 90 లక్షలు, విద్యుత్ అలంకరణ కోసం రూ. 10 లక్షల పనులు జరుగుతున్నాయి. మరో రూ. 4 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.. అనుమతులు రాగానే పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా పనులు పూర్తిగాకుండానే పాలక మండలిని మార్చితే అభివృధ్ది ఆగిపోతుందనే విమర్శలున్నాయి.
సమస్యల్లో వ్యవసాయ మార్కెట్‌లు
ఈసారి రబీలో మక్క దిగుబడి సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా వచ్చింది. మక్క సంచులను నిల్వ చేయడానికి గోదాములు అందుబాటులో లేవు. నూతనంగా గోధాములు నిర్మించాల్సి ఉంది. మార్కెట్‌లో విశ్రాంతి గదులు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. కమీషన్ ఏజెంట్ల దోపిడీని అరికట్టాల్సిన బాద్యత పాలక మండలిపై ఉంది. తరుగు పేరుతో తూకంలో కోతలు పెడుతున్నారు. ధాన్యం అమ్ముకున్న తర్వాత నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా తేమ, దూళి, నాసిరకం ధాన్యం తదితర కారణాలు చూపి గిట్టుబాటు ధరలో కోతలు విధిస్తున్నారు. గోదాములను ఆధనీకీకరణ చేయాలి.
పాలక మండలి ప్రాతినిధ్యం
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలిలో 14 నుంచి 18 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఇందులో రైతులు, వ్యాపారులు, సహకార సంఘం సభ్యులు, ప్రభుత్వ అధికారులు సైతం ఉంటారు. మహిళలతో పాటు మున్సిపల్ చైర్మెన్ సైతం ఉండాలి. రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా పాలక మండలి చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోలు చేసే ఏజెంట్లకు కాంట కోసం లైసెన్స్ జారీ చేస్తోంది. రైతులకు మౌళిక వసతులు కల్పించాలి.
మూడేండ్లకు పెంచాలనే డిమాండ్
వ్యవసాయ మార్కెట్ పాలక మండలి పదవీకాలం మూడేండ్లకు పొడగించాలి. రెండేండ్లకే పరిమితం చేస్తే… మార్కెట్‌లో సమస్యలు పరిష్కారం కావు. పాలక మండలి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయడానికి ఆర్థిక వనరులు కావాలి. ప్రభుత్వం సైతం సహకరించాలి. పదవి కాలాన్ని రెండేండ్లకే పరిమితం చేస్తే… పనులు అసంపూర్తిగా మిగిలి పోతాయి. కొత్తగా వచ్చిన పాలక సభ్యులు పెండింగ్‌లో ఉన్న పనులపై శ్రద్ద చూపే అవకాశాలు లేవు. అందుకే మార్కెట్ పాలక మండలి గడువు మూడేండ్ల పాటు పొడగించాలని పలువురు సభ్యులు కోరారు.
వ్యవసాయ మార్కెట్లలో సమస్యలు పరిష్కరించాలి
శివారెడ్డి, మార్కెట్ కమిటీ మెంబరు, నాగర్‌కర్నూల్ జిల్లా
వ్యవసాయ మార్కెట్లలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా పాలక మండలి పదవి కాలాన్ని మూడేండ్లకు పొడగించాలి. రైతులకు అందుబాటులో మార్కెట్ వ్యవస్థను ఆదునీకరించాలి. తాగునీరు, విశ్రాంతి గదులు, సీసీ రోడ్లు, గోదాముల వంటివి ఏర్పాటు చేయాలి.
సమస్యల నిలయాలు.. వ్యవసాయ మార్కెట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



