ఫీల్డు అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

– సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు టీజీయూఎఫ్‌ఏయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, జీతాలు పెంచాలని తెలంగాణ గ్రామీణ ఉపాధి ఫీల్డు అసిస్టెంట్ల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.భూపాల్‌, ఎం.నారాయణగౌడ్‌, నాయకులు అంజయ్య, తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూపాల్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు 17 ఏండ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు అందుబాటు లో ఉంటూ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పథకాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు గత పీఆర్సీ ఆధారంగా 30 శాతం జీతం పెంచి అమలు చేశారన్నారు. ఫీల్డు అసిస్టెంట్లకు మాత్రం పెంచలేదన్నారు. నిత్యావస రాల ధరలు విపరీతంగా పెరగడంతో ఫీల్డు అసి స్టెంట్ల కుటుం బాలు ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నాయని తెలి పారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.9,800 వేతనం కూడా అందరికీ సమానంగా రావడం లేదని వాపో యారు. జాబ్‌కార్డు హోల్డర్స్‌ పర్సంటేజీ సిస్టమ్‌ పెట్టడం వల్ల కొందరికి రూ.6,500, మరికొందరి రూ.8,000, అతి తక్కువ మందికి రూ.8,900 వేత నాలు అందుతున్నాయని వివరించారు. అందరికీ సమాన వేతనాలివ్వాలని కోరారు. జీవో నెంబర్‌ 60 ప్రకారం ఫీల్డు అసిస్టెంట్లకు కూడా రూ.22,500 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లిస్టు-3లో ఉన్నవారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. సర్క్యూలర్‌ 4779ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని సొంత మండలాల పరిధి లోకి బదిలీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Spread the love