Sunday, September 13, 2026
E-PAPER
Homeఖమ్మంవర్షంతో హర్షం.. పంటలకు ప్రాణం

వర్షంతో హర్షం.. పంటలకు ప్రాణం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో వ్యవసాయంపై ఆందోళన నెలకొంది. వర్షాలు లోటుగా ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కొనసాగిన లోటు వర్షపాతానికి తెరదించుతూ ఆదివారం కురిసిన విస్తారమైన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. పంటలకు ప్రాణం పోసిన వానలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వరి సాగు చేసిన రైతులు సైతం వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ నీటి అవసరం ఉన్న పత్తి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయనున్నాయి. కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగు ప్రారంభించిన రైతులు తాము నాటిన మొక్కలు వర్షపు నీటితో జీవం పోసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జామాయిల్‌ సాగు చేస్తున్న రైతులకు కూడా ఈ వర్షాలు ఎంతో ప్రయోజనకరంగా మారాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో కలిపి 1,380.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండల సగటు వర్షపాతం 60 మి.మీ. గా ఉంది. పాల్వంచలో అత్యధికంగా 117.6 మి.మీ. వర్షం కురిసింది. ఈ నెల 1 నుంచి 13వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 2,249.3 మి.మీ. లకు గాను 2,176.8 మి.మీ. నమోదైంది. దీంతో నెలవారీ వర్షపాతం 3.2 శాతం లోటుగా ఉంది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు సాధారణ వర్షపాతం 20,119.3 మి.మీ.లకు గాను 14,503.5 మి.మీ. మాత్రమే నమోదై, 27.9 శాతం లోటు కొనసాగుతోంది.

ఆదివారం నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే ఒక మండలంలో మోస్తరు వర్షం (1–3 సెం.మీ.), 12 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం (3–6 సెం.మీ.), 10 మండలాల్లో భారీ వర్షం (6–12 సెం.మీ.) కురిసింది. మొత్తంగా జిల్లాలో వర్షపాతం పరిస్థితుల్లో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, సీజన్‌ మొత్తంగా లోటు కొనసాగుతూనే ఉంది.

వర్షపాతం లెక్కల ప్రకారం జిల్లాలో 7 మండలాల్లో సాధారణం, 15 మండలాల్లో లోటు, ఒక మండలంలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే పాల్వంచలో 117.6 మి.మీ., కరకగూడెంలో 95.6, అశ్వాపురంలో 82.8, మణుగూరులో 82.4, లక్ష్మీదేవిపల్లిలో 83.0, కొత్తగూడెంలో 84.6, గుండాలలో 77.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. దమ్మపేటలో అత్యల్పంగా 34.0 మి.మీ. వర్షం కురిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -