ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి సరిత 

– చట్టాలపై అవగాహన పెంచుకోవాలి 
నవతెలంగాణ – పెద్దవంగర
గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత న్యాయ సేవ, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ సరిత అన్నారు. శనివారం మండలంలోని వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తొర్రూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ రాజ్, ఎస్సై మహేష్ తో కలిసి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయం అందరికి సమానమేనని, ధనిక, పేద, కులం మతం అనే తేడాలు లేవని తెలిపారు. సాక్షదారాల మీదకే కోర్టులు తీర్పులుస్తుందని అన్నారు. న్యాయ సేవాధికార చట్టం పేదలకు, బాలలకు, మహిళలకు, కల్పిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మంచి సమాజాన్ని నిర్మించుకుంటామని చెప్పారు. గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించడం ద్వారా చట్టాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తీసుకోవాలని సూచించారు. లేబర్ కార్డు, వినియోగదారుల పరిరక్షణ చట్టం, సమాచార హక్కు చట్టాల యొక్క ఆవశ్యకతను వివరించారు.
వేసవి కాలంలో ఎక్కువగా భూ తగాదాలు ఏర్పడతాయని, వాటిని సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, బాల్య వివాహాలు చేయడం నేరం అన్నారు. పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. సమాజంలో యువత ముఖ్యంగా గంజాయి కి బానిసలు అవుతున్నారని చెప్పారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నారు. మైనర్ కు వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాలు సంభవిస్తే తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామన్నారు. సత్వర న్యాయం కోసం ప్రతి రెండు నెలలకొకసారి నిర్వహించే జాతీయ లోక్ అథాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు అర్జీ పెట్టుకుంటే ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని చెప్పారు. కాగా పెద్దవంగరలో నిర్వహించిన న్యాయ సదస్సులో మండలంలోని ఎరువుల దుకాణందారులు ఎక్కువ ధరలకు ఎరువులు, యూరియా అమ్ముతున్నారని, ఎరువుల విక్రయాలకు సంబంధించిన రశీదు లు ఇవ్వడం లేదని, వారి షాపుల్లో ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా అమ్ముతున్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జడ్జి మండల వ్యవసాయ అధికారితో ఫోన్ లో మాట్లాడి.. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎక్కువ ధరలకు ఎరువులు అమ్మే దుకాణందారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ, మానిటరీ కమిటీ సభ్యులు వెంకన్న, కార్యదర్శులు వెంకన్న, మురళి, నాయకులు నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, ముత్తినేని శ్రీనివాస్, తంగెళ్ళపల్లి మల్లికార్జున చారి, బోనగిరి లింగమూర్తి, రాందయాకర్ రెడ్డి, మల్లేష్, రమేష్, అనిల్, యాకన్న, బిక్షపతి, సోమయ్య, కారోబార్ కుమారస్వామి, ప్రమోద్, పోలీసులు రాజారాం, సుధాకర్, సంతోష్, సురేష్, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love