క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Judgment reserved on quash petition– చంద్రబాబు కేసులో శుక్రవారం తీర్పు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. శుక్రవారం తీర్పు ఇవ్వనుంది. అలాగే ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిం చారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ”ఈ కేసులో 17ఏ సెక్షన్‌ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్‌ వర్తి ంచదు. 17ఏ సెక్షన్‌ అధికారిక నిర్ణయాల సిఫారసులకు మాత్ర మే వర్తి స్తుంది. ఈ సెక్షన్‌ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజా ప్రయోజ నాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించ దగినవే” అని రోహత్గీ వాదించారు. 17ఏ వర్తించదని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించారు. చంద్రబాబు తరపు మరో న్యాయ వాది సిద్దార్థ లూత్రా జోక్యం చేసుకుని మధ్యంతర బెయిల్‌ కోరారు. దీనికి జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ జోక్యం చేసుకుని తాము ప్రధాన విషయం విన్నామని, తాము తీర్పునే వెలువరిస్తామని అన్నారు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదు.
ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా కోరారు. దీంతో అప్పటి వరకు అరెస్టు చేయ వద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Spread the love