జుక్కల్ కాంగ్రేస్ టికెట్ ఎవరికో..

-అయోమయంలో కార్యకర్తలు
-అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి
-అంతర్గత కలహాలు, కుమ్ములాటలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్.
-ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే పరిస్థితి.
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
కారు జోరు.. చేయి బేజారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ జుక్కల్ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయిగాని..బీఆర్ఎస్‌ను ఓడించేంత స్థాయిలో లేదనే  అన్నది ప్రశ్నే. ఎలాగైనా జుక్కల్‌లోన్ గెలుచుకోవాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. అందుకే ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ గట్టిగానే ఉంటుందనే  ప్రజల నుండి టాక్ వినిపిస్తోంది.  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలోని  జుక్కల్ నియోజకవర్గంలోనే ముగిసి మహారాష్ట్రలో ప్రవేశించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం రావడంతో.. కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నాయి. ఎప్పుడైతే కేడర్‌లో ఉత్సాహం పెరిగిందో నాయకుల్లో గ్రూపులు కూడా అంతే తొందరగా తయారయ్యాయి. పార్టీ నిస్తేజంగా ఉన్నంతవరకు అంతా బాగానే ఉంది. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటం.. రాహుల్ యాత్ర తర్వాత పట్టు పెరిగిందని భావించడంతో గ్రూపులు పెరిగిన పార్టీ కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.  ఎవరి ఊపు వారిదే గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన కాంగ్రెస్ నేత సౌదాగర్ గంగారాం ఈసారి ఎలాగైనా.. హన్మంత్ షిండేపై గెలిచి అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే సమయంలో గడుగు గంగాధర్ అనే మరో నేత కూడా జుక్కల్ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాహుల్ పాదయాత్ర సమయంలో కూడా యాక్టివ్‌గా కనిపించారు. గడగు గంగాధర్ తీరుతో సౌదాగర్ గంగారాం అలిగి పాదయాత్ర నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసి నాయకులంతా ఆయన్ను బ్రతిమిలాడి సభకు తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీలోని స్థానిక విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఈ రెండు గ్రూపుల మధ్య ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మీకాంతరావు అనే మరో ఎన్ఆర్ఐ ప్రవేశించారు. తానూ లైన్‌లో ఉన్నానంటూ మీడియా సమావేశం నిర్వహించి రాహూల్ పాదయాత్రతో తాను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడైనట్టు ప్రకటించుకున్నారు. ఇప్పటికే ఆయన పేరు కూడా నియోజకవర్గంలో వినిపిస్తుండటంతో.ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు ముక్కలాట హాట్ టాపిక్‌గా మారింది.  గ్రూపులు, ముఠాలు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో తెలీని పరిస్థితుల్లో… జుక్కల్ కాంగ్రెస్‌లో ఇప్పటికే మూడు గ్రూపులు తయారయ్యాయి. నాయకులే ముఠాలు కట్టడంతో ఇక ఎక్కడికక్కడ స్థానిక, గ్రామస్థాయి కేడర్ కూడా గ్రూపులుగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ చీలిక ఎన్నికల నాటికి ప్రత్యర్థులకు మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు బయట ఎక్కడో లేరు..లోపలే  ఉన్నారని చెప్పవచ్చు.
Spread the love