రెవెన్యూ డివిజన్‌గా కాటారం

నవతెలంగాణ హైదరాబాద్: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. మహాదేవపూర్, కాటారం, మాహా ముత్తారం, మల్హర్, పలిమల మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. ఆగస్టులో కాటారం మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం.. తాజాగా తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2016లో జిల్లాల ఏర్పాటు సమయంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు మొత్తం 11 మండలాలతో భూపాలపల్లి డివిజన్‌ ఏర్పాటు చేశారు. దాదాపు ఏడేళ్లుగా అలాగే కొనసాగుతూ వస్తుండగా.. ప్రజల కోరిక మేరకు ఐదు మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love