కవితకు బెయిల్ ఇవ్వలేం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ఎందుకు ఇవ్వదల్చుకోలేదో కూడా స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆ ఉత్తర్వుల్లో ఉదాహరణలతో సహా వివరించారు. మధ్యంతర బెయిల్‌పై కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్, స్పెషల్ పీపీ లేవనెత్తిన వాదనలను, కోర్టుకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇంటెరిమ్ బెయిల్ ఇవ్వలేమని ఆ ఉత్తర్వుల్లో కావేరీ భవేజా క్లారిటీ ఇచ్చారు. చిన్న కొడుకు పరీక్షల నిమిత్తం బెయిల్ ఇవ్వాలన్న కవిత తరఫు వాదనలో కోర్టు సంతృప్తిచెందే అంశాలు లేవని స్పష్టం చేశారు. పెద్ద కొడుకు తన తల్లి మోరల్ సపోర్టు లేకుండా ఒంటరిగానే విదేశాల్లో చదువుకుంటున్నాడని, చిన్న కొడుకు సైతం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో కవిత సిస్టర్స్, బంధువులు అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 నిబంధన చాలా అరుదైన సందర్భాల్లోనే కోర్టు తన విచక్షణతో బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటుందని, గతంలో ప్రీతి చంద్రా, సౌమ్యా చౌరాశియా కేసుల్లో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాలు ప్రస్తుతం కవిత విషయంలో వర్తించేలా లేవన్నారు. కవితకు బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్న అంశాలను కూడా ఆ ఉత్తర్వుల్లో కావేరీ భవేజా విపులంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు గతంలో ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు మొబైల్ ఫోన్లు సహా డిజిటల్ ఎవిడెన్సులను మాయం చేయవద్దని స్పష్టంగా చెప్పినా నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ గతేడాది మే నెలలో సమర్పించిన నివేదికలో పేర్కొన్నదని స్పెషల్ జడ్జి గుర్తుచేశారు. ఈడీ సమర్పించిన ఆధారాలను సైతం ఆమె ఉదహరించారు.

Spread the love