కేరళ రబ్బరు రైతుల రాజ్‌భవన్‌ మార్చ్‌

– రైతు వ్యతిరేక రబ్బరు బిల్లును ఉపసంహరించాలి : వక్తల డిమాండ్‌
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలో రబ్బరు రైతులు కదం తొక్కారు. పది వేల మందికిపైగా రైతులు ఏఐకేఎస్‌ అనుబంధ కేరళ కర్షక సంఘం ఆధ్వర్యాన కేరళ యూనివర్సిటీ సమీపంలోని అసన్‌ స్క్వేర్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకూ మార్చ్‌ నిర్వహించారు. రాజ్‌భవన్‌ బయట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఏఐకేఎస్‌ అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ ధావలే, ఉపాధ్యక్షులు ఇవి జయరాజన్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజూ కృష్ణన్‌, రిసెప్షన్‌ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే వి జారు, ఏఐకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వాల్సన్‌ పనోలి తదితరులు ప్రసంగించారు. ఏఐకే ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం విజయకుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల రబ్బరు, ఇతర వాణిజ్య పంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 2009లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆసియన్‌ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల రబ్బరు, ఇతర వాణిజ్య పంటల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక రబ్బరు బిల్లును ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పంటగా రబ్బరు గుర్తించాలని, కిలోకు రూ.300 కనీస ధరగా నిర్ణయించాలని కోరారు. పన్నులు లేని రబ్బరు దిగుబమతులను నిలిపివేయాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని, రబ్బరు వ్యవసాయానికి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్న భారీ టైర్‌ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

Spread the love