మోడీ-సావర్కర్‌కు పోలికలు

– ఇద్దరూ నియంతృత్వానికి ప్రతీకలే…
– అందుకే సావర్కర్‌ జయంతిరోజు పార్లమెంటు భవన ప్రారంభం : ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్‌ ఉదయ్నార్కర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీకీ, సావర్కర్‌కు అనేక అంశాల్లో పోలికలు ఉన్నాయని మహారాష్ట్ర, కొల్హాపూర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌) ఉదరునార్కర్‌ అభిప్రాయపడ్డారు. అందుకే సావర్కర్‌ జయంతి రోజు రాష్ట్రపతిని కాదని, మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పారు. సుందరయ్య విజ్ఞానకేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో ‘సావర్కర్‌ జయంతినాడు పార్లమెంటు భవనం ప్రారంభమా?’ అంశంపై శనివారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. సావర్కర్‌ తరహాలోనే మోడీ కూడా నియంతృత్వానికి ప్రతీక అని చెప్పారు. దేశ విభజనకు జిన్నా ఎంత కారణమో, సావర్కర్‌ కూడా అంతే కారణమని విశ్లేషించారు. తనకు, జిన్నాకు ఎలాంటి విభేదాలు లేవని స్వయంగా సావర్కర్‌ రాసుకున్న పుస్తకంలో చెప్పుకున్నారని ఉదహరించారు. భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటింపచేసేందుకు సావర్కర్‌ చివరి వరకు ప్రయత్నించారనీ, ఆయన ఏనాడూ స్వాతంత్య్ర, జాతీయోద్యమంలో పాల్గొనలేదనీ, పైగా బ్రిటీష్‌ పాలకులకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. ప్రపంచ యుద్ధం సమయంలో భారత యువతను బ్రిటన్‌ దేశం తరఫున సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారని వివరించారు. హిందువులకు ముస్లింలే ప్రధాన శత్రువులు అని సావర్కర్‌ భావించారనీ, ఏనాడూ ఆయన బ్రిటీష్‌ వారిని భారత అక్రమణదారులుగా పరిగణించలేదన్నారు. పార్లమెంటు భవనం అంటే దానిలో లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా ఉంటుందనీ, దానిలో రాష్ట్రపతి, వారి కార్యదర్శులు కూడా ఉంటారని చెప్పారు. అన్నింటా తానే ఉండాలనే ప్రచార కాంక్షతోనే ఆ భవనాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభి స్తున్నారని అన్నారు. సావర్కర్‌ ఈ దేశం హిందువు లదే అని ప్రచారం చేశారనీ, జిన్నా పాకిస్తాన్‌ డిమాండ్‌కు ఇదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. సావర్కర్‌ చాలా త్యాగాలు చేశారని పుస్తకాల్లో రాసుకున్నారనీ, కానీ ఆయన అనేక రాజకీయ హత్యలకు కారణమయ్యాడనే కారణాలతోనే అండమాన్‌ జైలుకు పంపారని తెలిపారు. 1857లో సిపాయిల తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర పోరాటమని కీర్తిస్తూ సావర్కర్‌ రాసిన పుస్తకమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని వివరించారు. అయితే అంతకంటే ముందే కారల్‌ మార్స్క్‌ తొలి స్వాతంత్య్ర పోరాట పుస్తకం రాసారనీ, దానిలో హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటం చేయాలని పేర్కొన్నారని విశ్లేషించారు. సావర్కార్‌పై రెండు కేసుల్లో బ్రిటీష్‌ పాలకులు 50 ఏండ్ల శిక్ష వేశారనీ, కానీ 1911లో జైలుకు వెళ్లి 1921లో పదేండ్లకే విడుదల అయ్యారని తెలిపారు. జైలులో ఉన్నప్పుడు ఆయన బ్రిటీష్‌ పాలకులకు అనేకసార్లు క్షమాభిక్ష కోసం పిటీషన్లు పెట్టుకున్నారనీ, వీర సావర్కర్‌గా జైలుకి వెళ్లి, పిరికి సావర్కర్‌గా తిరిగివచ్చారని ఎద్దేవా చేశారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం, 1946లో ముంబయిలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్రో ద్యమాల్లో ఆయన ఎక్కడా పాల్గొనలేదన్నారు. అండమాన్‌ లోని కాలాపానీ జైలులో ఖైదీల హక్కుల కోసం జైలులోనే త్రైలోక్యనాథ్‌ చక్రవర్తి, హరేకృష్ణ కోణార్క్‌ వంటి నాయకులు పోరాటాలు చేస్తుంటే, సావర్కర్‌ కనీసం వారికి మద్దతుగా కూడా ఆ ఆందోళనల్లో పాల్గొనలేదని ఉదహరించారు. సావర్కర్‌ జైలులో ఉన్నప్పుడు 1924లో ‘ప్రిన్స్‌పుల్స్‌ ఆఫ్‌ హిందుత్వ’ అనే పుస్తకం రాసారనీ, ప్రజల్లో చీలిక తెచ్చేం దుకు బ్రిటీష్‌ వారితో ఒప్పందం చేసుకొని, జైలు నుంచి విడుదల అయ్యారని అన్నారు. జైలులో నైతికస్థైర్యాన్ని కోల్పో యి, ప్రజల్లోని జాతీయోద్యమ కాంక్షను తగ్గించేసి, దేశంలో పీష్వాల కాలంనాటి బ్రాహ్మణాధిక్య పాలన కొనసాగించాలని కాంక్షించారని తెలిపారు. భారతదేశం హిందువులదనీ, ఇదే వారికి పితృభూమి అనీ, పుణ్యభూమి అనీ తన పుస్తకంలో సావర్కర్‌ పేర్కొన్నారని చెప్పారు. హిందూఏతరులు అంతా ఇతరదేశాల నుంచి వచ్చినవారే అనీ, వారందరికీ మాతృ దేశాలు వేర్వేరుగా ఉన్నాయని తన రచనల్లో పేర్కొన్నారని తెలిపారు. భారతదేశంలో హిందూఏతరులు ఉండాలంటే, హిందువులు చెప్పినట్టు వినేవారే ఉండాలని సావర్కర్‌ తన పుస్తకంలో రాసుకున్నారని ఉదహరించారు. ఈ సిద్ధాంతమే జిన్నాకు తోడ్పడి, సైద్ధాంతిక నైతికతకు కారణమై, దేశ విభజన జరిగిందని వివరించారు. అంతకుముందు జరిగిన పలు ఎన్నికల్లో ముస్లింలీగ్‌, హిందూమహాసభ ఐక్యంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. జిన్నా, సావర్కర్‌ ఎప్పుడూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడలేదన్నారు. కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Spread the love