రోళ్లు పగిలేలా…

– మండుతున్న ఎండలు
– హుజూర్‌నగర్‌ ఏ 46.1 డిగ్రీలు
– ఈ ఏడాది ఇదే అత్యధికం
– రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో పలు జిల్లాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. ఈ వారం రోజులు మరింత పెరిగే అవకాశముంది. వడగాల్పులు కూడా ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలో తేమ శాతం తక్కువైపోతున్నది. చాలా ప్రాంతాల్లో గాల్లో తేమ 50 శాతం లోపే ఉంటుండటంతో ఉబ్బరం ఎక్కువ అనిపిస్తున్నది. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌, ప్లానింగ్‌ సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) నివేదిక ప్రకారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 46.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం. 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీం అసిఫాబాద్‌, ఖమ్మం జిల్లాలు రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో ఉన్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో ఎక్కువ సేవు ఎండకు గురికావడం, పనులు చేయడం వలన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది.

Spread the love