భగ్గుమంటున్న రామగుండం

సింగరేణి ఓపెన్‌ కాస్టుల వద్ద అధిక ఉష్ణోగ్రతలు
– తగ్గుతున్న కార్మికుల హాజరు శాతం
నవతెలంగాణ- గోదావరిఖని
వేసవి ఎండలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం భగ్గుమంటోంది. ఎన్టీపీసీ, సింగరేణి భారీ పరిశ్రమలు, బొగ్గుగనుల క్షేత్రాలు ఉన్న కారణంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామగుండంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈసారి మే 15నాటికే 45డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఇప్పుడు 47డిగ్రీల వరకు భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సింగరేణి వ్యాప్తంగా బొగ్గుగనులు, ఎన్టీపీసీల్లో పని చేసే కార్మికులు పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారికి సౌకర్యాలు కల్పించడంలో యజమాన్యాలూ నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. రామగుండం నగర వీధులు, కార్మిక ప్రదేశాలు మధ్యాహ్నం 12గంటలకల్లా నిర్మానుష్యంగా మారుతున్నాయి.
వేసవి ప్రారంభం మే 1 నుంచి కొన్ని రోజుల వరకు అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఈ ప్రాంతంలో కొంత ఎండ నుంచి ఉపశమనం లభించినా.. 10 రోజులుగా ఎండలు తీవ్రమవడంతో జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. నిత్యం బిజీగా ఉండే లక్ష్మినగర్‌, ప్రధాన చౌరస్తా, ఫైవ్‌ ఇంక్లయిన్‌, తిలక్‌ నగర్‌ చౌరస్తా, బస్టాండ్‌ ఏరియా, ఎన్టీపీసీలోని మేడిపల్లి చౌరస్తా, ఎఫ్‌సిఐ కార్నర్‌, రామగుండంలోని మజీద్‌ చౌరస్తా, రైల్వే స్టేషన్‌ ఏరియాలో జన సంచారం లేక పూర్తి నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక రోడ్లు నిప్పులు కక్కుతున్నాయి.
ఓపెన్‌కాస్టుల్లో అడుగుపెట్టలేని పరిస్థితి
సింగరేణి ఓపెన్‌ కాస్టుల వద్ద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 50డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ గనుల్లో పని చేసే కార్మికులు తమ పగటి సమయాలను మార్చాలని కోరుతున్నారు. రామగుండం రీజియన్‌లోని ఆయా ఏరియాల జీఎంల ఆదేశాలతో సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్య బృందం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు అవగాహన కల్పించారు. అక్కడక్కడా రక్షణ చర్యలూ తీసుకుంటోంది. అయినప్పటికీ కార్మికులు వేడిని తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
ఈ క్రమంలో కార్మికుల హాజరు శాతం తగ్గుతోంది. ప్రభుత్వము, యాజమాన్యాలు కనీసం చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గతంలో పలుచోట్ల చలివేంద్రాలు గతంలో ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఒక్క చలివేంద్రమూ ఏర్పాటు చేయలేదు. కార్మికుల హాజరు శాతంపై ప్రభావం చూపుతుందన్న కారణంగా ఓపెన్‌కాస్టులు ఏరియాలో 50డిగ్రీలపైనే ఎండలు నమోదువు తున్నా.. తగ్గించి చెబుతున్నారనే వాదనా ఉంది.

Spread the love