తాగునీటి లెక్కను తేల్చండి

– 20 శాతం లెక్కించాలి : కర్నాటక
– కేంద్రానికి లేఖ రాస్తాం: తుంగభద్ర బోర్డు నిర్ణయం

– 40 ఏండ్లుగా లేనిది ఇప్పుడెందుకు ? : ఏపీ
– ఆర్డీఎస్‌ ఆధునీకరణ చేపట్టాలి: తెలంగాణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తాగునీటి అవసరాల కోసం తీసుకునే నీటిని 20 శాతం మాత్రమే లెక్కించాలని కర్నాటక విజ్ఞప్తి చేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం తాగునీటికి 10 టీఎంసీలు నీటిని తీసుకుంటే, ఆ నీటిలో ఎనిమిది టీఎంసీల రిటర్న్‌ ప్లో ఉంటుందనీ, ఈనేపథ్యంలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కర్నాటక గట్టివాదనను వినిపించింది. తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు( టీఆర్‌ఎంబీ) సమావేశం చైర్మెన్‌ డీఎం రారుపురే అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది . ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి , కర్ణాటక జలవనరుల శాఖ ఈఎన్సీతో పాటు తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి అవసరాలకు 20 శాతం లెక్కించాలనే అంశంపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 40 ఏండ్లుగా లేనిది, ఇప్పుడు లేవనెత్తడం ఎందుకని ఏపీ కూడా ప్రశ్నిచింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ అమల్లోకి వచ్చినప్పటికి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని చెప్పారు. నీటి అవసరాలు పెరిగాయని అందువల్లే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని కర్నాటక అభిప్రాయపడింది. 20 శాతం మాత్రమే లెక్కించాలంటే రిటర్న్‌ ప్లోను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనీ, ఆ ఏర్పాట్లు లేకుండా 20 శాతం వాదనకు అర్థం లేదని ఏపీ సైతం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదలను విన్న టీఆర్‌ఎంబీ చైర్మెన్‌ రారుపురే మాట్లాడుతూ కష్ణా బోర్డు సమావేశంలోనూ ఈ అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందనీ, తుంగభద్ర బోర్డు సమావేశంలో కర్నాటక లేవనెత్తిన అంశాలతో పాటు కష్ణాబోర్డు సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర నీటి వనరుల శాఖకు లేఖ రాయనున్నట్టు ప్రకటించారు . ఇక ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలనీ, వాటా మేరకు నీరు తెలంగాణకు రావడం లేదని తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్‌ బోర్డు దృష్టికి తెచ్చారు. దీనిపై తుంగభద్ర బోర్డు చైర్మన్‌ రారుపురే స్పందిస్తూ ఆర్డీఎస్‌ ఆధునీకరణకు ముందు, కేంద్రం నీటి , విద్యుత్‌ పరిశోధన సంస్థ ( సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)తో అధ్యయనం చేయించాలంటూ కష్ణాబోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఆ అధ్యయనం అనంతరం నివేదిక అందిన తర్వాతే ఆధునీకరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎంబీ బడ్జెట్‌ పై చర్చ జరిగింది.

Spread the love