ఆదర్శమైన కమ్యూనిస్టు సుందరయ్య

– ఆయన అడుగుజాడల్లో నడవడమే ఉత్తమమార్గం : సుందరయ్య 38వ వర్ధంతి సభల్లో సీపీఐ(ఎం) నేతలు
‘ప్రజల మనిషిగా నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శనీయమైన కమ్యూనిస్టుగా నిలిచారు. జీవితాంతం నిరాడంబర జీవితం గడిపారు.. ఆయన స్ఫూర్తిగా నేటి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి” అని సీపీఐ(ఎం) నేతలు పిలుపునిచ్చారు. సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించారు.
నవతెలంగాణ- విలేకరులు
కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా అధిగమించాలో కార్యకర్తలకు సుందరయ్య నేర్పించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఈదులగూడెంలో బైక్‌ ర్యాలీ తీశారు. సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌వీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సుందరయ్య 38వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని 2024లో ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల్లో కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ.. పోరాటాల గడ్డగా పేరుగాంచిన మిర్యాలగూడలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ప్రజలందరూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని అధ్యయనం చేయాలని.. ఆయన చూపిన మార్గంలో రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కే.కే భవన్‌లో నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. నేటి రాజకీయాల్లో పదవులపై ఆశ తప్పా.. ప్రజల సంక్షేమం కోసం పని చేసే పరిస్థితి లేదన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాల్టీ రాగన్నగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సుందరయ్య వర్ధంతి జరిపారు. సుందరయ్య చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుందరయ్య ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, శాసనసభలో నికార్సైన ప్రతిపక్ష నేతగా నిలిచారని కొనియాడారు. నేడు పార్లమెంట్‌లోగానీ శాసనసభలోగానీ ప్రజాసమస్యలపై మాట్లాడే ప్రజానాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలోనూ జాన్‌వెస్లీ పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని బద్వేల్‌ చౌరస్తాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామ్మోహన్‌రావు పాల్గొ న్నారు.మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో భూపోరాట కేంద్రం వద్ద సుందరయ్య వర్ధంతి సభను సీపీఐ(ఎం) నాయకులు బోడేంకి చందు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఐఎస్‌ సదన్‌ చౌరస్తాలో సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం, వ్యకాస సంయుక్త ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి నిర్వహించారు. సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సుందరయ్య స్ఫూర్తితో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌ పాల్గొన్నారు.

Spread the love