తిరువనంతపురం : ఇప్పటికే దేశంలో మోడల్ రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ.. తాజాగా మరో ఘనతను సాధించింది. దేశంలో మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్‌ను బుధవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఈ పార్క్ కోసం టెక్నో పార్క్ ఫేజ్-4లో సుమారు 14 ఎకరాలను కేటాయించారు. అలాగే ఈ పార్క్ కోసం కెఐఐఎఫ్‌బి నుంచి 200 కోట్లను కేరళ ప్రభుత్వం కేటాయించింది. దీని మొత్తం అంచనా విలువ రూ. 1,515 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్ 5న దీనికి శంకుస్థాపన జరిగింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే డిజిటల్ సైన్స్ పార్క్‌కు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం విశేషం. వచ్చే ఏడాదిన్నర లేదా రెండు ఏళ్లలో 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు భవనాలను ఇక్కడ నిర్మిస్తారు. దీంతో పార్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
33 ఏళ్ల క్రితం ఈకే నాయనార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోనే తొలి టెక్నో పార్క్‌ను కేరళలో ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం దేశంలో తొలి డిజిటల్ యూనివర్శిటీని ప్రారంభించి దేశం మొత్తానికి ఐటి రంగంలో కేరళ రోల్ మోడల్‌గా నిలిచింది. ఈ యూనివర్శిటీ సమీపంలోనే డిజిటల్ సైన్స్ పార్క్ వాస్తవ రూపం దాల్చనుంది. ఈ పార్క్ నిర్మాణంలో ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ఎఆర్‌ఎం కేరళ ప్రభుత్వానికి సహకరిస్తుంది.