ఖతర్నాక్‌ కోల్‌కత

ఖతర్నాక్‌ కోల్‌కత– లక్నోపై 98 పరుగుల తేడాతో గెలుపు
– కోల్‌కత 235/6, లక్నో 137/10
లక్నో : కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫ్లే ఆఫ్స్‌ బెర్త్‌కు చేరువైంది. ఆదివారం లక్నోలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ సీజన్లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. 236 పరుగుల రికార్డు ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. మార్కస్‌ స్టోయినిస్‌ (36), కెఎల్‌ రాహుల్‌ (25) మినహా లక్నో బ్యాటర్లు అందరూ తేలిపోయారు.
తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. పించ్‌ హిట్టర్‌ సునీల్‌ నరైన్‌ (81, 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీతో దంచికొట్టాడు. 27 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన సునీల్‌ నరైన్‌..నైట్‌రైడర్స్‌కు మరోసారి భారీ స్కోరు అందించాడు. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (32, 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి అదిరే ఆరంభం అందించిన సునీల్‌ నరైన్‌.. యువ బ్యాటర్‌ రఘువంశీ (32, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి సైతం కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. అండ్రీ రసెల్‌ (12), రింకూ సింగ్‌ (16) నిరాశపరిచినా.. శ్రేయస్‌ అయ్యర్‌ (23), రమన్‌దీప్‌ సింగ్‌ (25 నాటౌట్‌) మెరవటంతో కోల్‌కత 235 పరుగులు చేసింది. లక్నో పేసర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌ (3/49) ఆకట్టుకున్నాడు.

Spread the love