విశాఖ ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్‌…1.75 కోట్లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్‌, వైకాపా నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. కిడ్నాపర్లు రెండురోజుల పాటు శరత్‌ ఇంట్లోనే ఉన్నారు. శరత్‌ను, జీవీని కొట్టి, ఒత్తిడి చేసి విలువైన వస్తువులతో పాటు, రూ.1.75 కోట్లు తీసుకున్నారు. పోలీసుల రాకను గుర్తించి పరారయ్యే క్రమంలో దొరికిపోయారు. బాధితులు ముగ్గురూ క్షేమంగా ఇంటికి చేరారు. ఈ ఘటనపై విశాఖ సీపీ త్రివిక్రమవర్మ గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. డబ్బు కోసమే నిందితులు కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో అయిదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఫోన్‌ చేయించి రప్పించారు ఎంపీ తన కుమారుడు శరత్‌కి రుషికొండలో ఒక ఇంటిని పెళ్లికానుకగా ఇచ్చారు. ముగ్గురు కిడ్నాపర్లు 13వ తేదీన ఆ ఇంట్లోకి వెళ్లారు. అప్పుడు ఇంట్లో శరత్‌ ఒక్కరే ఉన్నారు. ఆయనపై దాడిచేసి భయపెట్టారు. ఇల్లంతా వెతికి, ఆభరణాలు తీసుకున్నారు. ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నారు. అవసరమైన ఆహారం శరత్‌తో ఆర్డర్‌ పెట్టించారు. 14వ తేదీ ఉదయం తనకు ఆరోగ్యం బాగోలేదని శరత్‌తో ఆయన తల్లి జ్యోతికి ఫోన్‌ చేయించారు. ఉదయం 8గంటలకు వచ్చిన ఆమెవద్ద ఉన్న బంగారం సైతం లాగేసుకున్నారు. ఎంపీకి సన్నిహితంగా ఉండే జీవీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందని ఆలోచించి.. జ్యోతి, శరత్‌తో ఆయనకు ఫోన్‌ చేయించారు. అనుమానంగానే వెళ్లిన జీవీపై కిడ్నాపర్లు దాడికి పాల్పడ్డారు. ఓ ఖాతాకు దాదాపు రూ.75 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. మరో రూ.కోటి నగదును తమ డ్రైవర్‌తో తెప్పించి, జీవీ వారికి ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారన్న అనుమానం రాగానే బందీలుగా ఉన్న ముగ్గురితో ఎంపీ కారులో పరారయ్యారు అని సీపీ వివరించారు.

Spread the love