10 వేల మందితో కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌

– నాసిక్‌ నుంచి ముంబయి వరకూ
నాసిక్‌ : 10 వేల మందితో నాసిక్‌ నుంచి ముంబయి వరకూ సాగే కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ను సోమవారం ఏఐకేఎస్‌ ప్రారంభించింది. ఉల్లిపాయలకు లాభదాయక మైన ధరతో సహా 17 డిమాండ్ల చార్టర్‌తో ఈ మార్చ్‌ ప్రారంభమైంది. పత్తి, సోయాబీన్‌, పచ్చి మిర్చి, పాలు, పప్పు ధాన్యాలు, హిర్దా వంటి ఉత్పత్తులకు కూడా లాభదాయకమైన ప్రకటించాలనీ, ఉల్లిపాయలకు క్వింటాల్‌కు రూ 2000 మద్దతు ధర ప్రకటించాలనీ, తక్షణమే క్వింటాల్‌కు రూ. 600 సబ్సిడీ ఇవ్వాలనీ, ఎగుమతి విధానాల్లో మార్పులు చేయాలని కూడా ఈ మార్చ్‌ ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. అలాగే రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బిల్లులను రద్దు చేయాలని, 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం, బీమా కంపెనీలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మార్చ్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే సాగులోఉన్న అటవీ భూములు, పచ్చిక బయళ్లు, దేవాలయ, ఇనాం, వక్ఫ్‌, బినామీ భూములను సాగుదార్ల పేరుతో పట్టాలు ఇవ్వాలని మార్చ్‌ డిమాండ్‌ చేస్తోంది. పీఎం హౌసింగ్‌ స్కీమ్‌ సబ్సిడీని రూ. 1.40 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచాలనీ, కొత్తగా సర్వే నిర్వహించి దరఖాస్తు దారుల పేర్లను ‘డి’ లిస్టులో ఉంచాలనీ, ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో భూ సేకరణ చేయాల్సి వస్తే కేరళ ఫార్ములా ప్రకారం పరిహరం ఇవ్వాలని కూడా మార్చ్‌ డిమాండ్‌ చేస్తోంది. అలాగే వయోజన, ప్రత్యేక పెన్షనును నెలకు రూ. 4 వేలకు పెంచాలని, 2005 తరువాత జాయిన్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్దరించాలని, ఎయిడెడ్‌ పాఠశాలలకు 100 శాతం నిధులు ఇవ్వాలని, ప్రభుత్వ పోస్టుల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలనీ, కాంట్రాక్ట్‌ కార్మికులు, స్కీమ్‌ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల్లో నకిలీ ఆదివాసీలను తొలగించి, వారి స్థానంలో నిజమైన ఆదివాసీలను నియమించాలని మార్చ్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ మార్చ్‌కు ఏఐకేఎస్‌ అఖిల భారత అధ్యక్షులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, తదితరులు పాల్గొన్నారు. ఏఐకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అజిత్‌ నవాలే నేతృత్వం వహిస్తున్నారు.

Spread the love