పోషకాహారం అందట్లేదు..

– ఆఫ్రికా దేశాల కంటే భారత్‌ వెనకబాటు
– గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళనకరం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపై ఆరోగ్య నిపుణులు, విశ్లేషకుల ఆందోళన
భారత్‌లో పోషకాహార లోపం ఆందోళనను కలిగిస్తున్నది. ప్రజలలో పోషకాహార స్థాయిలు క్ర తగ్గిపోతున్నాయి. పలు ప్రభుత్వ నివేదికలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. అయితే, ప్రభుత్వాల పనితీరులో మాత్రం మార్పు కనబడటం లేదని ఆరోగ్య నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా భారతీయ జనాభా యొక్క పోషకాహార స్థితి నెమ్మదిగా దిగజారుతున్నదని అన్నారు. భారతదేశంలో పోషకాహారం తీసుకోవడంపై ఐదు సంవత్సరాల జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ఇదే విషయాన్ని వెల్లడించింది.
న్యూఢిల్లీ : పోషకాహార క్షీణత గ్రామీణ భారత్‌లో ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. దేశ జనాభాకు అత్యంత ముఖ్యమైన శక్తి, మాంసకృత్తులకు మూలమైన ఆహారధాన్యాలు అందటం లేదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మూడు దశాబ్దాల నయా-ఉదారవాద సంస్కరణల కాలంలో తలసరి తృణధాన్యాల వినియోగం తగ్గిందన్నారు. చాలా సంవత్సరాలుగా భారతదేశం వినియోగ స్థాయిని నమోదు చేసింది. ఇది ఆఫ్రికా స్థాయి కంటే చాలా తక్కువ. అలాగే, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల స్థాయి కంటే తక్కువ కావటం గమనార్హం.
భారత్‌లో ఆహారంపై తలసరి వాస్తవ వ్యయం దశాబ్దాలుగా అలాగే పడిపోతున్నది. తలసరి జీడీపీ వృద్ధి రేటు అధికంగా ఉన్నదని చెప్తున్న భారత్‌ వంటి దేశానికి ఆహారంపై తక్కువ ఖర్చు చేయటం గమనార్హం. తలసరి ఆహార వ్యయంలో దీర్ఘకాలిక పతనాన్ని సమర్థించేందుకు ఆర్థికవేత్తలు అన్ని రకాల తప్పుడు వాదనలను ముందుకు తెచ్చారని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని దాచటంలో భాగమని అన్నారు.
పోషకాహార లోపం వంటి సమస్యలు చిన్నారులు, మహిళల్లో ఇంకా అధికంగా ఉన్నదని తెలిపారు. ఇలాంటి కారణంతో వారు రక్తహీనత, తక్కువ బరువు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిని సారించి పోషకాహారం ప్రజలకు అందేలా చేయాలని వారు సూచించారు. ఈ విషయంలో సంబంధిత శాఖకు కేటాయించిన నిధులు మురిగిపోకుండా, పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Spread the love