మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేస్తారా..లేదా..?

– ఎందుకని అఫిడవిట్‌ దాఖలు చేయలేదు..
– ఎందుకు సిగ్గు పడుతున్నారు ?
– కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
– సీపీఐ(ఎం) ఒక్కటే తమ వైఖరి తెలిపింది….
– మిగతా పార్టీలేవీ ముందుకు రాలేదు
– రాజకీయ పార్టీల విముఖత ఆశ్చర్యంగా ఉంది : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్‌)పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఎఎస్‌జీ) కెఎం నటరాజ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ”మీరు రిప్లై దాఖలు చేయలేదు. ఎందుకు సిగ్గుపడుతున్నారు?” అంటూ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కేంద్రం విముఖతపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూటిగా నిలదీశారు. కౌంటర్‌ అఫిడవిట్‌ సమర్పించేందుకు గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
కానీ ప్రభుత్వం స్పందించలేదు.ఎఎస్‌జీ కేంద్రప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేయగా..వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అది వేరని అన్నారు. ”మీరు ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదు? మీరు మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలనుకుంటున్నారా? లేదా? అది చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఇది మనందరికీ సంబంధించినది” అని అన్నారు.
పిటిషన్‌ పై స్పందించడానికి ,రాజకీయ పార్టీలు తమ ‘వైఖరి’ తెలపడానికి ముందుకు రావడానికి విముఖత వ్యక్తం చేయడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ”ఎవరూ వైఖరి తీసుకోవడానికి ముందుకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది” అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు.ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ చాలా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టే అంశాన్ని చేర్చాయని తెలిపారు. ”రాజకీయ పార్టీలు ఏమి చెబుతాయో తెలుసుకోవాలని నేను ఆసక్తిగా ఉన్నాను. సీపీఐ(ఎం) తప్ప ఏ పార్టీ కూడా తమ వైఖరిని స్పష్టం చేయడానికి ముందుకు రాలేదు” అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. ”మీరు సమాధానం దాఖలు చేసి ఉండాల్సింది” అని ఎఎస్‌జీ నటరాజ్‌కు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచించారు. తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్‌కు వాయిదా వేసింది.
ఎనిమిదేండ్ల కిందట పార్లమెంట్‌లో రద్దయిన ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’ను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కోరింది. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేయనున్న అఫిడవిట్‌పై స్పందించేందుకు పిటిషనర్‌కు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. కాని ఇప్పటికీ కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయలేదు.
మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్‌ చేసే మహిళా రిజర్వేషన్‌ (రాజ్యాంగం 108 సవరణ) బిల్లు, 2008 అని మరింత అధికారికంగా పిలవబడుతుంది. ఈ ప్రతిపాదిత సవరణ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టాలని స్పష్టం చేస్తుంది. ఈ బిల్లును 2010లో రాజ్యసభ ఆమోదించినప్పటికీ, ఇంకా లోక్‌సభ ముందు ప్రవేశపెట్టలేదు.

Spread the love