చర్చలు స్వల్పం..బిల్లులు అధికం

– ఆమోదించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ : లోక్‌సభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఢిల్లీ సర్వీసులు, డేటా ప్రొటెక్షన్‌ వంటి వివాదాస్పద బిల్లులు సహా మొత్తం 22 బిల్లులను ఆమోదించారు. అయితే వీటిలో పది బిల్లులపై కనీసం గంట చొప్పున కూడా చర్చ జరగకపోవడం గమనార్హం. కొన్ని బిల్లులను నిమిషాల వ్యవధిలోనే ఆమోదించేశారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై మాత్రం దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను చివరి రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019లో 17వ లోక్‌సభ ఏర్పడినప్పటి నుండీ పని గంటలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కూడా ఉభయ సభలు జరగడం లేదు. వర్షాకాల సమావేశాలు అయితే నిర్ణయించుకున్న షెడ్యూలు సమయంలో 43% మాత్రమే నడిచాయి. లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కొంచెం మెరుగు. అయినా షెడ్యూల్‌ సమయంలో 55% మాత్రమే నడిచింది. నిర్ణయించుకున్న సమయంలో సగం కంటే తక్కువే పని చేసినప్పటికీ లోక్‌సభ వర్షాకాల సమావేశాలలో 25 బిల్లులను ప్రవేశపెట్టి 22 బిల్లులను ఆమోదించారు. 2019 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బిల్లులను ఆమోదించిన సందర్భాలు రెండే ఉన్నాయి. 2019 బడ్జెట్‌ సమావేశాలలో 35 బిల్లులు, 2020 వర్షాకాల సమావేశాలలో 25 బిల్లులు ఆమోదం పొందాయి.ఈసారి రాజ్యసభ 25 బిల్లులను ఆమోదించింది. 17వ పార్లమెంట్‌ తొలి సమావేశాలలో 29 బిల్లులు ఆమోదం పొందాయి. ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఎగువసభలో బిల్లులు ఆమోదం పొందడం ఈ సమావేశాలలోనే జరిగింది. దిగువసభతో పోలిస్తే ఎగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య తక్కువే. లోక్‌సభ సమావేశాలలో 22 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ వాటిపై చర్చ జరిగింది మొత్తంగా 14 గంటలే. అన్ని కార్యకలాపాలు కలిపి లోక్‌సభ 43 గంటల పాటు నడిచింది.
ఢిల్లీ ప్రాదేశిక (సవరణ) బిల్లు, అనుసంధాన్‌ జాతీయ పరిశోధనా సంస్థ బిల్లు మినహా మిగిలిన బిల్లుల పైన కనీసం గంట చొప్పున కూడా చర్చ జరగలేదు. సగటున చూస్తే ఒక్కో బిల్లు పైన 40 నిమిషాల పాటు చర్చించి ఆమోదించారు. వస్తువులు, సేవల పన్నుకు సంబంధించిన రెండు బిల్లులపై కేవలం రెండేసి నిమిషాల పాటు మాత్రమే చర్చ జరిగింది. జాతీయ నర్సింగ్‌, డెంటల్‌ కమిషన్లపై బిల్లులను మూడేసి నిమిషాల పాటు చర్చించారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై మాత్రం 4 గంటల 54 నిమిషాల సేపు చర్చ జరిగింది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ చాలా తక్కువగా ఉండడంతో లోక్‌సభలో కంటే బిల్లులపై ఎక్కువ సమయం చర్చించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో లోక్‌సభలో కంటే రాజ్యసభలో ఎక్కువ సమయం బిల్లులపై చర్చ జరపడం ఇది మూడోసారి. ఉదాహరణకు ఢిల్లీ సర్వీసుల బిల్లుపై రాజ్యసభలో ఎనిమిది గంటలకు పైగా చర్చ జరిగింది. సభలో ఆమోదించిన 25 బిల్లులలోనూ 10 బిల్లులపై మాత్రమే గంట కంటే తక్కువ సమయం చర్చ జరిగింది.
రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
– ఇకపై చట్టాలుగా ఢిల్లీ సర్వీసులు, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లులు
పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొందిన ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. శనివారం రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఢిల్లీ సర్వీసుల బిల్లును ఆగస్టు 3న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభలో ఆగస్టు 7న ఈ బిల్లు ఆమోదం పొందింది. అలాగే డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు కూడా చట్టరూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Spread the love