విరాట్ బాగోదన్నా వినిపించుకోని కేఎల్..

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే భారత జట్టు విజయానికి 26 పరుగులు అవసరమైన దశలో కోహ్లి 74 రన్స్‌తో ఉన్నాడు. అంటే కోహ్లి సెంచరీకి కూడా సరిగ్గా 26 రన్స్ అవసరం. దీంతో కోహ్లి సెంచరీ చేస్తాడా..? లేదా? అని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూశారు. అవతలి ఎండ్‌లో హార్దిక్ పాండ్యలాంటి ఆటగాడు ఉంటే కోహ్లి శతకం చేసేవాడు కాదేమో. కానీ రాహుల్ ఉండటం కోహ్లికి కలిసొచ్చింది. ఓ సిక్స్, ఫోర్ బాది ఊపుమీదున్న రాహుల్.. విరాట్ శతకం ముంగిట స్లో అయ్యాడు. సింగిల్స్ తీస్తూ తన పార్టనర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. 39వ ఓవర్లో ఓ సిక్స్, రెండు సింగిల్స్ తీసిన కోహ్లి 81 రన్స్‌కి చేరుకున్నాడు. 40వ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్ బాదిన కోహ్లి చివరి బంతికి సింగిల్ తీశాడు. దీంతో 90ల్లోకి అడుగుపెట్టాడు. కోహ్లి సెంచరీకి, టీమిండియా విజయానికి 8 రన్స్ అవసరం అయ్యాయి. మరుసటి ఓవర్లో హసన్ మహ్ముద్ వైడ్ వేయడంతో టెన్షన్ పెరిగిపోయింది. భారీ షాట్లు ఆడేందుకు వీల్లేకుండా బంగ్లా బౌలర్ స్లో బంతులేయడంతో కోహ్లి వేగంగా పరిగెత్తి రెండు పరుగులు తీశాడు. సిక్స్ కొడితే కోహ్లి సెంచరీ అవుతుంది అదే సమయంలో భారత్ విజయానికి 5 పరుగులు చాలు. దీంతో కోహ్లి బౌండరీ కొట్టడానికి కోహ్లి ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. దీంతో సింగిల్ తీద్దామని భావించాడు. కానీ నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రాహుల్ వారించాడు. ఆ ఓవర్లో మరో మూడు పరుగులు చేసిన విరాట్.. తర్వాతి ఓవర్లో సిక్స్‌తో సెంచరీ చేయడంతోపాటు జట్టును గెలిపించాడు. కోహ్లి సెంచరీ ముంగిట ఉన్నప్పుడు సింగిల్ తీస్తానని చెప్పాడని.. కానీ తాను నిరాకరించానని మ్యాచ్ అనంతరం రాహుల్ తెలిపాడు. ‘నువ్వు సింగిల్స్ తీయకపోతే బాగోదు. నా వ్యక్తిగత మైలురాళ్ల కోసం నేను ఆడుతున్నానని జనం అనుకుంటారని కోహ్లి అన్నాడు. దీనికి నేను బదులిస్తూ.. మనం సునాయాసంగా గెలుస్తున్నాం. నువ్వు సెంచరీ పూర్తి చేయి’ అని తాను కోహ్లికి చెప్పానన్నాడు.

Spread the love