కొడితే ఫేమస్‌ అయిపోయింది

– తెలంగాణ పోరడు తీసిన సైన్మా
సుదీర్ఘ చరిత్ర కలిగిన సినిమా రంగంలో తెలంగాణ సినిమాలు అంటే పదుల సంఖ్యలోనే చెప్పుకోవచ్చు. పైగా తెలంగాణ సినిమా అంటే సమస్యలను హైలైట్‌ చేసే డాక్యుమెంటరీలు తప్ప ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో పూర్తి మెయిన్‌ స్ట్రీమ్‌ కమర్షియల్‌ సినిమాలు రావడం అరుదు అనే చెప్పవచ్చు. ‘మా భూమి’ సినిమా అప్పట్లో కమర్షియల్‌గా హిట్‌ అయినప్పటికీ ఆ సినిమా పూర్తి ఆర్ట్‌ ఫిల్మ్‌ తరహాలో ఉంటుంది. ఇక తెలంగాణా కథా వస్తువుతో తయారైన సినిమా అంటే 1974లో శ్యామ్‌ బెనెగల్‌ తెరకెక్కించిన ‘అంకుర్‌’ సినిమానే. ఆ తరువాత ‘చిల్లర దేవుళ్లు, వేములవాడ భీమకవి’ వంటి సినిమాలు వచ్చినా తక్కువ సినిమాలే వచ్చాయని చెప్పాలి.
తెలంగాణ కథా వస్తువుతో సినిమాలు రూపొందుతున్నాయి అని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు, తరువాత పరిస్థితులను చర్చించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు సినిమా రంగంలో కామెడీ క్యారెక్టర్స్‌ మాట్లాడాలంటే తెలంగాణ యాసను ఆశ్రయించేవారు. ప్రధాన పాత్రలు అసలు తెలంగాణ యాసలో మాట్లాడేవారే కాదు. మొండి మొగుడు – పెంకి పెళ్లాం సినిమాలో మటుకు హీరోయిన్‌గా నటించిన విజయశాంతి తెలంగాణ యాసలో మాట్లాడుతుంది. బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలలో తెలంగాణ నేపథ్యంతో చిత్రీకరించినా అవి పూర్తిస్థాయి తెలంగాణా చలన చిత్రాలని చెప్పలేం. అంతకుముందు చిరంజీవి మరో సినిమా రుద్రనేత్రలో తెలంగాణ ప్రాంత యువకుడిగా కనిపిస్తారు. అది కూడా కొద్దిసేపు మాత్రమే. తెలంగాణ ప్రాంతం అంటే మరో తరహా సినిమాలనూ చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల కోణంలోంచి వచ్చిన మెయిన్‌స్ట్రీమ్‌ కమర్షియల్‌ తెలుగు సినిమాలలో నక్సలిజం, తిరుగుబాటు వంటి కథావస్తువులు కనిపిస్తుంటాయి. ఆ కోవలో ‘ఒసేరు రాములమ్మ, ఎన్‌కౌంటర్‌’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ యాసకు, తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టేలా సినిమాలు రూపొందుతుండడం స్వాగతించదగిన పరిణామం. ‘ఫిదా, లవ్‌ స్టోరీ, పిట్టగోడ, జాతి రత్నాలు, వకీల్‌ సాబ్‌, విరాటపర్వం, బలగం’ తదితర సినిమాలు తెలంగాణ సామాజిక జీవితాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాలు, ఆ ప్రాంతాలలోని జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం పుట్టుకొచ్చింది. విరాటపర్వం సినిమాలో తెలంగాణ జీవితం, తెలంగాణ యాస, తెలంగాణ పేదరికం, తెలంగాణ సమస్యలు… అన్నింటినీ చిత్రీకరించగలిగినా మిగతా సినిమాలవంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం అని చెప్పలేం. మిగతా సినిమాలు ఆ ఇతర రాష్ట్రాలలోని ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలతో పోటీ పడుతుండడం హర్షించదగినది. తెలంగాణ ప్రాంతంనుంచి నటీనటులే కాదు, సాంకేతిక వర్గంలోనూ ఎందరో కొత్తవారు ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే దర్శకులుగా సురేందర్‌ రెడ్డి, హరీష్‌ శంకర్‌, శేఖర్‌ కమ్ముల తదితరులు తమను తాము నిరూపించుకున్నారు. వేణు ఊడుగుల విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. వేణు శ్రీరామ్‌, అనుదీప్‌ తదితరులు తెలంగాణా ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు రూపొందించగలమనే సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో తెలంగాణా కుర్రాడు ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాతో తెరమీదకొచ్చాడు. అతడు సుమంత్‌ ప్రభాస్‌. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేపట్టాడు. అంతేకాదు హీరోగా నటించి తనను తాను నిరూపించుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించిన తెలంగాణ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూస్తున్నంతసేపూ మన పోరగాళ్లు, మన భాష, మన యాస, మన పల్లె, మన మనుషులు అనే ఓ దగ్గరితనం కనిపిిస్తుంటుంది. మన భాష, మన సంస్కృతి, మన చుట్టూ ఉన్న మనుషుల సంతోషాలు, దు:ఖాలు కథలుగా మారి కళ్లముందు కనిపిస్తుండడం సినీ ప్రేమికులను అలరిస్తుంది. తెలంగాణ మూలాలను తడిమి చూసుకుంటూ వచ్చిన ‘బలగం’ సినిమాలాగే ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా ఎందరినో ఆకట్టుకుంటున్నది. ఈ సినిమా ద్వారా యాభై మంది యువత వెండితెరకు పరిచయం కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
మేమ్‌ ఫేమస్‌…
అచ్చంగా మన గ్రామీణ ప్రాంతం అనేలా ఎవరికివారే సొంతం చేసుకోగల అన్ని లక్షణాలు ఉన్నాయి సినిమాలో. సినిమాలో నటించిన కొత్తవాళ్లు ఏ ఒక్క సీన్‌లోనూ తమకిది తొలి సినిమా అనిపించేలా లేకపోవడం సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు అంతటోడినే ఆశ్చర్యపరిచిన విషయం. ఆయన ‘అసలు కెమెరా ముందు నటిస్తున్నామన్న స్పృహ లేకుండా ఎలా నటించగలిగారు వీళ్లంతా?’ అంటూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు సినిమాలో ఎక్కడా భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్‌, భారీ మేకప్పులు లేకుండా ఎంతో సహజంగా చిత్రీకరించడాన్ని ఎందరో ప్రముఖులు మెచ్చుకోవడం సినిమాలోని నూతన నటులకు భవిష్యత్తుపట్ల ఆశలు రేకెత్తిస్తున్నాయి. పట్నం వాసన సోకని పల్లె పిల్లల్లా వారి నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. సినిమాలో కథ గురించి చెప్పుకోవాలంటే పెద్దగా కథ ఉన్నట్లే అనిపించదు. కథను నడిపించిన తీరుతో ప్రేక్షకులను సినిమా అయిపోయేదాకా కూర్చోబెట్టగలుగుతుంది. ఎవరు సినిమా చూసినా అది తమ ఊరి కథే అనుకోగలరు. కామెడీ, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌తో చక్కగా రూపొందించిన సినిమా. పక్కా తెలంగాణ యాసలోనే సినిమా అంతా సాగుతుంటుంది. గుర్తు పెట్టుకోదగిన డైలాగ్స్‌ తెలంగాణ యాసలోనే ఆకట్టుకుంటాయి. ”అరే, మీరంటే వయసోల్లురా. తలకాయలు ఎటంటే అటు తిరుగుతరు. కానీ, మీ అమ్మ అయ్య ముసలోల్లు కదా. ఒక్కసారి దించుకుంటే ఊళ్లె తలకాయ ఎత్తనీకి మస్తు కష్టమైతది”, ”లైఫ్‌ల స్పీడ్‌ బ్రేకర్‌ను చూసి డెడ్‌ ఎండ్‌ అనుకోవద్దు. నువ్వు చేశేది ఏ పనైనా సరే, కొడితే ఫేమస్‌ అయిపోవాలె”వంటి డైలాగులు సినిమాలో వినిపిస్తుంటాయి. ఇంతాచేసి సినిమాకు పనిచేసిన వారంతా కొన్ని పాత్రలను తప్పిస్తే అందరూ పాతికేళ్లు అయినా నిండనివారే. సినిమా రచయిత, దర్శకుడు, హీరో అయిన 23 ఏళ్ల సుమంత్‌ ప్రభాస్‌ మాటల్లో చెప్పాలంటే ”హార్డ్‌ వర్క్‌ చేయొద్దు. స్మార్ట్‌ వర్క్‌ చేయాలె. స్మార్ట్‌ వర్క్‌ ఎట్ల చేయాల్నని హార్డ్‌ వర్క్‌ చేయాలె” ఈ కొటేషన్‌ను తన ఇంట్లో గోడకు రాసి పెట్టుకున్నాడట. అతడు అనుకున్నట్లే ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాకు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఫలితం కళ్లముందు కనిపించింది. స్టోరీలైన్‌ ఒక్కమాటలో చెప్పమంటే ”నథింగ్‌ టు సమ్‌థింగ్‌” అని చెప్పాడు. మహేష్‌ బాబు ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమా చూసిన వెంటనే అతడి రెండో సినిమాకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చిత్రరంగంలోకి అడుగుపెట్టిన సుమంత్‌ ప్రభాస్‌కు అభినందనలు చెబుతూ మనమూ హృదయపూర్వకంగా స్వాగతిద్దాం.
– ఎన్‌.కె.

Spread the love