దళితులను విస్మరిస్తున్న కోమటిరెడ్డి

– నాలుగున్నర సంవత్సరాలలో కోమటిరెడ్డి నల్లగొండకు ఎన్నడూ రాలేదు 

 – వర్గాలుగా విభజిస్తూ పార్టీకి దూరం చేసే ప్రయత్నం
 – నేటి నుండి నియోజకవర్గాల వ్యాప్తంగా దళిత ఆత్మీయ సమావేశాలు 
 – విలేకరుల సమావేశంలో దళిత, బీసీ సంఘం నేతలు
 నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
 భువనగిరి ఎంపీ, నల్లగొండ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళితులను విస్మరిస్తున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్ ఆరోపించారు. ఓడిపోయిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో   ఎన్నడూ నల్లగొండకు రాలేదని.. ఎవరి బాగోవులు పట్టించుకోలేదని  విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ  గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ పార్టీకి ఎంతో కష్టపడి పని చేశానని తెలిపారు. దళితులమైన సొంత డబ్బులతో కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నానని తెలిపారు. తామంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేస్తూ ఉంటే దుబ్బాక నరసింహ రెడ్డి, కొండేటి మల్లయ్య వర్గాలంటూ వారి అనుచరులు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. వర్గాల ను సృష్టించి పార్టీకి దూరం చేసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో 11వ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసి   30 లక్షల రూపాయలను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా నష్టపోయిన ఏనాడూ కోమటిరెడ్డి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్ రెడ్డి సోదరులు నియోజకవర్గాలలో నాయకులను ఎదిగనియకుండా  గత 30 సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షులుగా ఒక్కరినే  కొనసాగడం వారి రాజకీయ నిరంకుశత్వానికి నిదర్శనం అని  విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు  ఒకరితో కూడా మాట్లాడకుండా ఏకపక్షంగా ఎన్నికల్లోకి వెళ్లడం వారి అహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. కోమటిరెడ్డి దళితులను కడుపులో పెట్టుకుంటానని చెప్పిన మాటలు డొల్ల మాటలని కొట్టి పడేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేయటానికి ప్రత్యక్ష సాక్ష్యం తానేనని  తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారికి, మునుగోడులో  రాజగోపాల్ రెడ్డికి  ప్రాధాన్యత ఇవ్వడం పట్ల నిజమైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుండి అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా దళిత ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాలలో ఎస్సీ సెల్ నాయకులతో అభ్యర్థులు సమావేశం ఏర్పాటు చేయకపోతే ఈ నెల 18 నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో గడపగడపకు వెళ్లి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులకు వ్యతిరేకంగా దళితులకు జరిగిన అన్యాయంపై ఓటర్లకు చెబుతామని హెచ్చరించారు. అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గోలి సైదులు, కాంగ్రెస్ మాదిగ యూత్ జేఏసీ జిల్లా  నాయకులు దున్న ఏడుకొండలు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు  లక్ష్మీనారాయణ లు  మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో దళిత నాయకులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అరాచకాలు  ఈనాటివి కావని, గత కొన్ని సంవత్సరాలుగా ఏ  ఒక్క దళితుడిని కూడా రాజకీయంగా ఎదగనీయకుండా చేసిన ఘనత కోమటిరెడ్డి కి తక్కుతుందని విమర్శించారు. దళిత నాయకులను ఓటు బ్యాంకుగా వాడుకొని రాజకీయంగా పబ్బం గడుపుతూ ఏ ఒక్క దళితునికి అండగా లేని కోమటిరెడ్డి సోదరులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కార్యకర్తలకు, నాయకులకు కోమటిరెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు  గమనిస్తున్నారని తెలిపారు. బిసి నాయకులను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకొని ఆర్థికంగా నష్టపరిచి బికారులను చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ ఒక్కరోజు బీసీ వర్గాల కోసం పోరాటం చేసిన దాఖలాలు లేవన్నారు. అబద్ధపు ప్రకటనలతో బీసీల  ఓట్ల కోసం బీసీ నాయకునికి  టికెట్ ఇస్తామని మోసం చేసిన కోమరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని  కోరారు. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుల రాజకీయ ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఎస్సీ నియోజకవర్గాలపై తమ ఆధిపత్యం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తామని ఎంతో మందిని ప్రోత్సహిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి నేడు డబ్బులకు అమ్ముడుపోయి వేరే వాళ్లకు టికెట్లను అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. కొండేటి మల్లయ్య, సుంకరి  మల్లేష్ గౌడ్ వంటి ఎంతోమంది ఎస్సీ, బీసీ వర్గాల నాయకులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడ్డాడని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఊడగొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ, బీసీ సంఘాల నాయకులు కత్తుల శివరాజు, కత్తుల గోవర్ధన్, చింత లక్ష్మయ్య, బోయ అనిల్, కత్తుల రాజు,  నగేష్, లక్ష్మణ్, కొండేటి చింటూ, రాంబాబు, కాసర్ల శివకుమార్, తదితరులు ఉన్నారు.
Spread the love