పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా కమ్యూ నిస్టులలో కూడా వేరుగా కనిపించే ధన్యజీవులలో ఒకరు కొరటాల సత్యనారాయణ. పుట్టింది మోతుబరి రైతు కుటుంబం, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబ, బంధువుల నేపథ్యంలో తన వర్గస్వభాన్ని వదులుకుని పీడిత ప్రజలకు బాసటగా నిలిచిన అనేక మంది కమ్యూనిస్టులలో ఒకరు. పూవు పుట్టగానే పరిమలస్తుందన్నట్లుగా అనుచితమైన డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా హైస్కూలులో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబరు 24న జన్మించిన కొరటాల 2006 జూలై ఒకటిన అనారోగ్యంతో మరణించారు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలోనూ, తరువాత 1975లో విధించిన అత్యవసర పరిస్థితిలో నాలుగేండ్లపాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. తెలంగాణా సాయుధపోరాటానికి మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులపై నాటి మద్రాస్ ప్రావిన్సులో భాగంగా ఉన్న ఆంధ్రాప్రాంతంలో తొలుత బ్రిటీష్ పోలీసులు, తరువాత కాంగ్రెస్ పాలకులు నిర్బంధ కాండ, అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లకు వేలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులు బలయ్యారు. ఆ క్రమంలో 1948లో అరెస్టయి బళ్లారి, కడలూరు జైళ్లలో మూడేండ్లకు పైగా ఉన్నారు. ఆ సమయంలో జైలు అధికారుల నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురై ఆకస్మికంగా ఆకలి మందగించటం తరువాత తిరిగి కోలుకునే, ఒక అరుదైన జబ్బుకు గురై జీవితాంతం అనుభవించారు.
ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో గుంటూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది. సీపీఐ(ఎం)లో నలుగురు పొలిట్ బ్యూరో సభ్యులను అందించింది. వారిలో కొరటాల ఒకరు. రేపల్లె తాలూకా నేత నుంచి అగ్రస్థానానికి ఎదిగిన క్రమంలో ఆయన మాదిరి ప్రజాసమస్యలను అధ్యయనం చేయటంలో ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు మరొకరు లేరనటం అతిశయోక్తి కాదు. సీపీఐలో చీలిక కంటే నగ్జలైట్ల విచ్చిన్నం గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి ఎనలేని హాని చేసింది. దాదాపుగా సీపీఐ(ఎం) కనుమరుగైందన్న స్థితిలో అక్కడక్కడా ఉన్న సభ్యులు, కార్యకర్తలను సమీకరించి తిరిగి ఒక రూపానికి తీసుకురావటంలో కొరటాల ప్రముఖపాత్ర పోషించారు. ఆయన మరణించి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రపంచ, భారత కమ్యూనిస్టు ఉద్యమాలలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎదుర్కొంటున్న సవాళ్ల పూర్వరంగంలో ఆ కామ్రేడ్ నుంచి నేటి పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు, నేతలు, పత్రికారంగంలో ఉన్నవారు నేర్చుకొని ఆచరించాల్సిన అనుభవాలు అనేకం ఉన్నాయి.
స్థానిక నేతగా ఉన్న సమయంలో చల్లపల్లి జమిందారీ భూములు, బంజరు భూముల సమస్యలపై జరిగిన పోరాటాలలో కొరటాల భాగస్వామి. నగ్జల్స్ విచ్చిన్నం తరువాత జిల్లా కేంద్రంలో బాధ్యతలు తీసుకొని పని చేస్తున్న సమయంలో రైతాంగం ముఖ్యంగా వాణిజ్య పంటలను సాగుచేసే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రీకరించి పని చేశారు. సింథటిక్ పైరిత్రాయిడ్స్ వాటి అధికవాడకం కారణంగా తలెత్తిన తెల్లదోమసమస్యతో పత్తి రైతాంగం ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడటాన్ని స్థానిక ప్రజాసంఘాలు, పార్టీ కార్యకర్తలు ఒక సాధారణ అంశంగా పరిగణించిన తరుణంలో ప్రకాశం జిల్లాలో పర్యటించి ఆత్మహత్యల కారణాలను మీడియా దృష్టికి తేవటంలో కొరటాల ముందున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కరువుతో అల్లాడుతున్న బడుగుజీవులకు గంజికేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు అవసరమైన నిధులు, వస్తు సేకరణలో కూడా ఆయనకు ప్రముఖ పాత్ర ఉంది. గోదావరి వరదలకు ఉభయగోదావరి జిల్లాలు అస్తవ్యస్తమైనపుడు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ మూడు ఉదంతాలలో కొరటాలతో పాటు ఒక జర్నలిస్టుగా ఆ ప్రాంతాలను సందర్శించి సమస్యలను అవగాహన చేసుకొనేందుకు నాకు (వ్యాసకర్త) ఎంతో ఉపయోగపడింది.
రైతు సంఘ రాష్ట్రనేతగానే కాదు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకునిగా కూడా ఆయన పనిచేశారు. ఎనభయ్యవ దశకంలో ప్రవేశించిన వ్యవసాయ పనుల కాంట్రాక్టు విధానం కార్మికులకు ఎలా నష్టదాయకమో కూడా ఆయన అధ్యయనం చేసి హెచ్చరించారు. అంతేకాదు గుంటూరు జిల్లాలో గణనీయంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యల మీద కొరటాలకు ఉన్న పట్టు ఎలాంటిదంటే ఆ సామాజిక తరగతికి చెందిన వారు ఆయనను తమవాడిగా భావించారు. వారి సమస్యలపై అదే సామాజిక తరగతికి చెందిన కొందరు పేరు ప్రఖ్యాతులున్న నాయకులతో సమంగా కొరటాల పనిచేశారు. ఇలా వివిధ రంగాలలో పనిచేసిన కమ్యూనిస్టులు చాలా అరుదని కూడా చెప్పవచ్చు. కమ్యూనిస్టులు దళితులపై జరుగుతున్న కులవివక్ష అంశాన్ని పట్టించు కోవటం లేదంటూ అంబేద్కరిస్టులు చేస్తున్న ప్రచారదాడుల పూర్వరంగంలో దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం(కేవీపీఎస్) ఏర్పాటుకు చొరవ తీసుకున్నది కొరటాల అనే అంశం నేటి తరాలకు చాలామందికి తెలియదు. ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్- కొరటాల మధ్య అనుకోకుండా జరిగిన చర్చలు దానికి పునాది వేశాయి. ఆ తరువాతే వివిధ రాష్ట్రాలు, కేంద్రంలో సంస్థలు ఏర్పడ్డాయి.
ప్రజాశక్తి సాహితీ సంస్థ అధ్యక్షుడిగా కూడా కొరటాల ప్రముఖ పాత్ర పోషించారు. ఎడిషన్ల విస్తరణ,ఒక సమగ్ర పత్రికగా దాన్ని రూపొందించాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో తపించారు. విద్యార్థి ఉద్యమ దశనుంచి దశాబ్దాలపాటు కొరటాలతో ఏర్పడిన వ్యక్తిగత, ఉద్యమ సాన్నిహిత్యం (ఈ వ్యాసకర్త) జర్నలిస్టుగా ఎదగటానికి తోడ్పడింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గుంటూరు జిల్లా పరిషత్ సభ్యులుగా కొరటాల, పుతుంబాక వెంకటపతి సమావేశాలలో లేవనెత్తిన అంశాలను వార్తలుగా పంపటం సాధారణ విషయం. ఆ సమావేశాలకు అందచేసే అజెండాను అధ్యయనం చేయటం ద్వారా ప్రభుత్వ పథకాలలో ఉన్న డొల్లతనాన్ని అర్ధం చేసుకొనేందుకు జిల్లా కేంద్రాలలో పని చేసే ప్రతి జర్నలిస్టుకు ఎంతో అవసరం. ఇది వ్యక్తిగత సమస్యకాదు, ప్రజలకోసం పనిచేసే పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు కేవలం నేతల ఆరోపణలు ప్రత్యారోపణల మీద కేంద్రీకరించటం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి జనం అజెండాను ముందుకు తేవాల్సి ఉంది.
కమ్యూనిస్టు ఉద్యమంలో సంభవించిన విచ్చిన్నాలతో యువ కార్యకర్తలు, నాయకులు అందరూ సీపీఐ(ఎం)కు దూరమయ్యారు. పునర్‌నిర్మాణ సమయంలో నేతలకు, కొత్తగా ఉద్యమంలోకి వచ్చిన విద్యార్ధులు, యువకులకు ఎంతో వయసు వ్యత్యాసం ఉంది. దాన్ని అధిగమించి యువతతో మమేకం కావటంలో కమ్యూనిస్టు అగ్రనేతలలో కొరటాలకు మరొకరు సాటి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఐదు పదుల వయస్సు దాటిన తరువాత రెండు పదులలోపు మాలాంటి యువకులతో ‘ఏరా బాబూ..ఎలా ఉన్నావ్’ అంటూ భుజాల మీద చేయి వేసి మాట్లాడే నేతలు ఈ రోజుల్లో ఎందరు కనిపిస్తారు? 1970-80 దశకాల్లో అలాంటి నేతలలో కొరటాల తీరే వేరు. నేటి తరాల వారు యువతరానికి దగ్గర అవుతున్నామా? నాయకులమనే భేషజాలకు పోతున్నామా? అని ప్రతి ఒక్కరూ అవలోకించుకోవటం అవసరం.
(నేడు కొరటాల 20వ వర్థంతి)
ఎం.కోటేశ్వరరావు
8331013288



